ఓటమి ఎరుగని నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓటమి ఎరుగని నేతగా కొనసాగతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. మంచి ప్రజాప్రతినిధిగా మన్ననలను చూరగొన్నారు. ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రజా క్షేత్రంలో నిలబడి విజయవంతంగా ఎన్నికవుతూ.. వస్తున్నారు.
జవాన్‌గా...
1962లో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో జన్మించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలెట్‌గా చేరి.. మిగ్ 21, 23ల ఫ్రంట్ లైన్ ఫైటర్‌గా కొనసాగాడు. అక్కడ రిటైర్డ్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా వ్యవహరిస్తూ.. వస్తున్నారు.
ఓటమా.. అంటే?
ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి ఎరుగని నేతగా విజయదుందుభి మోగిస్తున్నారు. మొదటిసారి 1999లో కోదాడ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్.. 2004లోనూ అదే స్థానం నుంచి మరోసారి గెలుపొందారు. 2009, 2014లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హుజూర్‌నగర్ శాసనసభ్యుడిగా మరోసారి ఆయన జయకేతనం ఎగురవేశారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... బరిలో దిగిన ప్రతిసారి ఉత్తమ్ విజయఢంకా మోగించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
ఇవీ చూడండి: తెలంగాణ లోక్‌సభ విజేతలు