Sand Mafia In Kodada: కొంతకాలంగా ఏపీలోని కృష్ణా పరీవాహక ప్రాంతం నుంచి.. నిత్యం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సుమారు 80 నుంచి 100 లారీలు ఇసుక తీసుకొని అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కోదాడ నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటు రెవెన్యూ, మైనింగ్, రవాణా అధికారులను మేనేజ్ చేయడంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒక్కో లారీలో 65 టన్నుల వరకు లోడ్ చేసుకొని హైదరాబాద్ తెచ్చి.. లారీకి రూ.75 వేల వరకు అమ్ముతున్నారు. ఇలా సగటున రోజుకు రూ.60 లక్షలకు పైగా ఇసుక వ్యాపారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి ఈ వ్యవహారంలో హైడ్రామా నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, విజయవాడ నుంచి అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి.. హైదరాబాద్‌లో విక్రయానికి వెళుతున్న లారీలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) అధికారులు.. కోదాడ సరిహద్దుల్లో పట్టుకున్నారు. లారీలను అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉందని.. ఏపీ ఇసుక మాఫియా వారిని దబాయించింది.
ప్రజా ప్రతినిధి పీఏనే సూత్రధారి: సుమారు 15 లారీల డ్రైవర్లు, లారీలకు ఎస్కార్ట్‌గా వస్తున్న వారు.. ఐదుగురు అధికారులతో తొలుత వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిని పక్కకు తోసివేసి లారీలను హైదరాబాద్ దిశగా నడిపించారు. అధికారులు డయల్ 100కు ఫోన్ చేయగా, కోదాడ పోలీసులు సకాలంలో స్పందించలేదని టీఎస్‌ఎండీసీ అధికారులు తెలిపారు. వారు ఉన్నతాధికారులకు విషయం చెప్పగా.. నల్గొండ పోలీసులు కేతేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు లారీలను, రాచకొండ పోలీసులు చౌటుప్పల్ పరిధిలో 3 లారీలను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన.. ఓ ప్రజాప్రతినిధి పీఏ అధికారులకు ఫోన్ చేసి ఆ లారీలు పట్టుకోవడానికి మీకేం అధికారం ఉందని బెదిరించినట్లు సమాచారం.