నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే తెరాస అభ్యర్థిని ఈ నెల 29న రాత్రి పొద్దుపోయాక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారు. 30న నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా నియోజకవర్గంలోని బలమైన సామాజికవర్గం అభ్యర్థి వైపు తెరాస అధిష్ఠానం మొగ్గుచూపుతోంది. దుబ్బాక ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనప్పటికీ... పార్టీ ఆది నుంచి అనుసరిస్తున్న రాజకీయ వారసత్వాన్ని పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలనే భావనతో ఉంది. పోటీలో ఉన్న ఇతర నేతలకు ఇప్పటికే సంకేతాలిచ్చింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 30 మంచి రోజనే భావనతో అదే రోజు నామినేషన్ వేయించేందుకు అధిష్ఠానం ఆలోచిస్తోంది. పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు పరోక్షంగా అభ్యర్థి పేరును ప్రస్తావిస్తున్నారు.
రేపు తెరాస అభ్యర్థి ఎంపిక.. ఎల్లుండి నామినేషన్ దాఖలు - శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ లేదా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది. టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలకు భాజపా గాలం వేస్తుందని ప్రచారం జరుగుతండటంతో.. తెరాస చివరి వరకు వేచి చూసే ధోరణి అనుసరిస్తోంది.
Trs candidate selection on the 29th for nagarjuna sagar by election
తొమ్మిది మంది మంత్రులు ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగనున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. 7 మండలాలు, 2 పురపాలికల్లో మంత్రులకు సీఎం బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ రెండో వారంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.