Komatireddy Brothers : అన్న చాటు తమ్ముడిగా రాజకీయ ప్రవేశం చేసిన రాజగోపాల్‌రెడ్డి.... కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన కమలం గూటికి చేరారు. అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రిని తిట్టను కాని ఆమె నియమించిన రేవంత్‌ను వదలనంటూ శపథం చేశారు. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. నల్గొండ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్టీకి రాజీనామా చేయడమే కాదు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుని ఉప ఎన్నికకు సిద్ధపడటం మునుగోడు పాలిటిక్స్ ఊపందుకున్నాయి.
Komatireddy Brothers Part ways : ఎమ్మెల్యే పదవీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని మునుగోడుతో పాటు నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో పార్టీపై ఏ మేరకు ప్రభావం ఉంటుందోనని టీపీసీసీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. గతంలో రాజగోపాల్‌రెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడంతో ఆ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాజాగా పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనతో పాటు వెళ్లేదెవరనే దానిపై మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీలో ఉండేవాళ్లేవరు, రాజగోపాల్‌రెడ్డి వెంట వెళ్లేవాళ్లేవరనే దానిపై పీసీసీ ఇప్పటికే సమగ్ర సమాచారం సేకరించినట్లు సమాచారం.
Komatireddy Brothers update : ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ పార్టీలు, ఉప ఎన్నిక వస్తే టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. తాజాగా రాజగోపాల్‌రెడ్డి సర్వే ఫలితాల అనంతరమే రాజీనామా చేస్తానని ముందుగా ప్రకటించినా.. రాకముందే రాజీనామా చేయడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర మొదలైన మొదటి రోజే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో భాజపా కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
వెంకట్‌రెడ్డి దారెటు.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ప్రస్తుతం అందరి దృష్టి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పడింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుండటంతో రానున్న ఉప ఎన్నికల్లో ఆయన తన తమ్ముడికే వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, కోమటిరెడ్డి సోదరుల అభిమానులు రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితులపై చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్.. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకున్న ఒక్క అసెంబ్లీ సీటును రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో కోల్పోయినట్లైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొమ్మిదింటిలో తెరాస గెలుపొందగా... హుజూర్‌నగర్, నకిరేకల్, మునుగోడుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. దీంతో 2019 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఏడాది ఎంపీ ఎన్నికలకు ముందే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరారు.
తాజాగా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం లేకుండా పోయింది. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే నని పునరుద్ఘాటించిన రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీలో చేరడం లాంఛనంగా మారింది. ఉప ఎన్నిక జరిగితే ఆ పార్టీ నుంచి ఆయనే అభ్యర్థి కానున్నారు. అధికార తెరాసతో పాటు కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు పలువురు ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.