నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన హాలియాలో జరిగిన రైతాంగ ధన్యవాద సభలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మఠంపల్లి, చింతలపల్లి మండలాల గిరిజనులకు రెండు మూడ్రోజుల్లో పట్టాలిస్తామని ప్రకటించారు. ‘కొంతమంది కాంగ్రెస్ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు భాజపా వాళ్లు ప్రవర్తిస్తున్నారు. మీలా మాట్లాడటం మాకు చేతకాక కాదు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్, భాజపా విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలకు ఇవ్వడం చేతకాలేదు. మేం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నరు. వాళ్లు రైతు రాబందులు..’ అని సీఎం వ్యాఖ్యానించారు.
కమీషన్ల కోసమే సాగర్‌ను కట్టారా?
‘‘పదవులు, పైరవీల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలను బలి పెట్టారు. నాగార్జునసాగర్ ఇంకో 19 కి.మీ. ఎగువన కట్టాలే. కాని దుర్మార్గుడు కేఎల్‌రావు తెలంగాణ నీటి వాటాను తగ్గించి వారి ప్రాంతానికి నీళ్లను తీసుకుపోయిండు. ఏలేశ్వరం వద్ద సాగర్‌ను కడితే ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకాల అవసరమే ఉండకుండే. ఆంధ్రకు అనుకూలంగా ప్రాజెక్టులు కడితే మూగనోము వహించింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? ప్రజలకు వారు సమాధానం చెప్పాలి. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని నిండు సభలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా నిలదీయలేదు. ఇప్పుడు పొలంబాట, పోరుబాట అంటూ సీఎల్పీ నేత బయల్దేరారు. ప్రాజెక్టులను కడితే కమీషన్ల కోసమే కడుతున్నారు అంటున్నారు. అప్పట్లో మీరు నాగార్జునసాగర్‌ను కమీషన్ల కోసమే కట్టారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉంటే కుదరదు. ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లాలోని ఒక తరాన్ని నాశనం చేసింది. లక్షన్నరమంది జీవితాలు నాశనం అయ్యాయి. మేం ఫ్లోరైడ్‌ను నూరు శాతం తరిమేశాం. రెండు పంటలకు నీళ్లిస్తున్నాం. అవినీతిరహితంగా పాలిస్తున్నాం.
చంద్రబాబు హయాంలో పొలాలను ఎండబెట్టినా ఎవరూ మాట్లాడలేదు. నాడు కరెంటు లేదు. ఎరువుల్లేవు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదు. దేశంలో అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమే. ప్రస్తుతం కోటీ పది లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. మరో నాలుగైదు నెలల్లో మరో 25 లక్షల ఎకరాల్లో సాగు అందుబాటులోకి వస్తుంది.
పథకాలు పూర్తిచేయకపోతే ఓట్లు అడగం
నల్గొండ అనాదిగా చాలా నష్టపోయిన జిల్లా. ఏ నాయకుడూ, ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. గతంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరిగినప్పటి నుంచి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిరంతరం ఇక్కడి సమస్యలను నా దృష్టికి తెస్తున్నారు. రూ. 2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి నేడు శంకుస్థాపన చేశాం. ఏడాదిన్నరలోపు వీటిని పూర్తి చేసి నీరందిస్తాం. సాగర్ ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటాం. ఏడాదిన్నరలోపు ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. తెరాస వీరుల పార్టీ. వీపు చూపించే పార్టీ కాదు.
గోదావరి నీళ్లతో నల్గొండ కాళ్లు కడుగుతాం
కృష్ణాలో నీటి లభ్యత తక్కువ. దేవుడు కనికరం వల్ల గత రెండేళ్ల నుంచి నది మంచిగా పారుతోంది. ఒకవేళ ఇక్కడ నీరు లేకపోయినా ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుతో పాలేరు వాగు నుంచి పెద్దదేవులపల్లి చెరువుకు నీటిని తీసుకొచ్చి సాగర్ ఆయకట్టుకు నీళ్లందిస్తాం. దీనికి రూ. 600 కోట్లతో డీపీఆర్ సిద్ధమయింది. త్వరలో అనుమతులు ఇస్తాం. అవసరమైతే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరాను కూడా ఎండనివ్వం. గోదావరి నీళ్లతో నల్గొండ కాళ్లు కడుగుతాం.
ఉమ్మడి నల్గొండ సస్యశ్యామలం
డిండి ఎత్తిపోతలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. బ్రాహ్మణవెల్లంల, ఎస్‌ఎల్‌బీసీలకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించి పూర్తి చేస్తాం. బస్వాపూర్ జలాశయాన్ని పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌లో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లిస్తాం. గాలి మాటలకు మోసపోవద్దు. మంచి పార్టీని, మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలే. అలా కాదంటే మన చేతులే కాలుతాయి. మోసపోకుండా, ఆగం కాకుండా నాకు అండగా ఉండండి. మీ సంక్షేమ బాధ్యతను నేను తీసుకుంటా’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.