తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల్లో డబ్బు, మద్యమే కాదు...మిక్సీలు కూడా! - 2019 tg elections

ఎన్నికల తంతు అంటేనే డబ్బు, మద్యం హవా నడుస్తుందనేది బహిరంగ రహాస్యమే. గెలుపే లక్ష్యంగా శాసనసభ ఎన్నికల్లోనే కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేశారు. అలాంటిది అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న లోక్​సభ పోరులో వాటి ప్రవాహం చెప్పక్కర్లేదు. ఎక్కడికక్కడ నోట్ల కట్టలు పట్టుబడి, కేసులు నమోదవుతున్నాయి.

ఎన్నికల్లో మద్యం, డబ్బు హవా

By

Published : Apr 8, 2019, 5:23 PM IST

ఎన్నికల హడావుడి ప్రారంభమై మూడు వారాలు పూర్తి కావొస్తోంది. ప్రచార గడువు కూడా దగ్గరపడింది. ఇక నాయకులు తెరవెనక ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, మద్యం, ఇతరత్రా సామగ్రి చేరవేయటంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. చెక్​ పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు చేయాలని ఆదేశించింది. నల్గొండ, సూర్యాపేట తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటం వల్ల అక్రమంగా వీటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో కోటిన్నరకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న 169 మిక్సీలు పట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారిపై 63 కేసులు నమోదు చేశారు.

ప్రధాన మార్గాల్లోనే పోలీసులు తనిఖీలు చేస్తున్నందున... మండల కేంద్రాలు, గ్రామాల మీదుగా అక్రమ నగదు, మద్యం రవాణా సాగుతోంది. సొంత వాహనాలైతే సులువుగా దొరికిపోతామన్న భావనతో... ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటున్నారు. ఉన్నతాధికారుల సూచనతో తనిఖీ చేయగా... రెండ్రోజుల క్రితం కోదాడ బస్టాండులో 46 లక్షలు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు... చీరెలు, మిక్సీలు, వెండి వస్తువులు, యువతకు క్రికెట్ కిట్లు పంచేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

గ్రామాల్లో పంపిణీ చేసేందుకు బూత్​ స్థాయిలో కీలక కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నగదు కంటే మద్యాన్నే ఎక్కువగా పంచేందుకు... ఎన్నికల షెడ్యూలు రాకముందే రహస్య గోదాముల్లో భద్రపరుచుకున్నట్లు సమాచారం. గుడుంబా, మద్యం గొలుసు దుకాణాలపై పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల నాటికి నాలుగున్నర కోట్ల మద్యం పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గంపగుత్తుగా ఓట్లు వేయాలంటూ... కుల, మహిళా సంఘాలకు తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు హవా

ఇవీ చూడండి: 'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట

ABOUT THE AUTHOR

...view details