పరీక్షలు బాగా రాసినా ఊహించని విధంగా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యామని వాపోతున్నారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. నల్గొండలో ఓ కళాశాలకు చెందిన బీఏ టీహెచ్‌పీ ఆరో సెమిస్టర్‌కు చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థిని... 7 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో మాత్రం ఫెయిల్ అయింది. ఈమె మెరిట్ విద్యార్థిని. ఐదో సెమిస్టర్ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులో పాసై 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించి ప్రతిభ చాటింది. తాను రాసిన ఆ సబ్జెక్టులో 70 మార్కుల వరకు వస్తాయని భావిస్తుంటే ఫెయిల్ అయ్యానని తెలిసి అవక్కయ్యానని వాపోయింది.
పలువురు బాధితులు
ఇదే కళాశాలలో బీఏ ఈహెచ్‌పీ ఆరో సెమిస్టర్ విద్యార్థి శ్రవణ్‌కుమార్ 7 సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి బయోఫర్టిలైజర్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఇతనూ మెరిట్ విద్యార్థే. ఏడో సెమిస్టర్ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులు పాసై 9.50 గ్రేడ్ పాయింట్లతో సత్తా చాటారు. తాను పరీక్ష బాగా రాశానని...అసలు ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని పేర్కొంటున్నాడు. ఇదే కళాశాలకు చెందిన బీఏ హెచ్‌పీపీ విద్యార్థి నవీన్ 7 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. పరీక్ష బాగా రాసినా తాను ఒక సబ్జెక్టులో ఊహించని విధంగా ఫెయిల్ కావడంతో కలతచెందానని వాపోయాడు. ఇతనూ మెరిట్ విద్యార్థే. ఐదో సెమిస్టర్ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులు పాసై 9.14 గ్రేడ్ పాయింట్లు సాధించారు.