Ministers on work shop: మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని అప్పుడే అన్ని రకాలుగా అన్నదాతలు అభివృద్ధి చెందుతారని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వానాకాలం సాగు సన్నద్ధతపై నిర్వహించిన వర్క్‌షాపులో మంత్రులు పాల్గొన్నారు. వానాకాలంలో వేయాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు.
పత్తికి భారీ డిమాండ్ ఉందని.. వీలైనంత ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ పత్తి అంటే హాట్‌కేక్‌లా అమ్ముడు పోతుందన్నారు. రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని.. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని వెల్లడించారు. ప్రజల జీవన విధానంలో ఆహారంలో మార్పు వచ్చిందని తెలిపారు. తృణధాన్యాలు, ఉద్యాన పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం నూనెగింజల కొరత తీవ్రంగా ఉందని.. రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరగాలన్నారు. దాదాపు10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు వ్యూహాత్మక అడుగులు వేయాలని నిరంజన్‌రెడ్డి వివరించారు. తెలంగాణలో వ్యవసాయానికి అన్ని రకాల వసతులు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పత్తి పంట వేయాలి. తెలంగాణ పత్తి అంటే హాట్‌కేక్‌లా అమ్ముడు పోతుంది. పత్తికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరగాలి. ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఆయిల్‌పామ్‌లో 168 రకాల ఉప ఉత్పత్తులు ఉంటాయి. ఆయిల్‌పామ్ సాగుతో ఇండోనేషియా, మలేషియాకు మంచి ఆదాయం వస్తోంది. మనదేశంలో వంటనూనె ఉత్పత్తి తక్కువగా ఉంది. నూనె దిగుమతులకు ఏటా రూ.90 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. భిన్నమైన పంటలు వేయాలని రైతులను కోరుతున్నాం.- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి