Rajagopal Reddy Resigns as MLA : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు స్పీకర్ తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయనున్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే.. ఆరు నెలల లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయం. దీంతో రాజీనామాను స్పీకర్ తనకు అందిన వెంటనే ఆమోదిస్తారా..? లేక న్యాయ సలహా తీసుకుని ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా..: కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన ఆయన.. అవమానాలు భరిస్తూ ఉండలేనన్నారు. రాజీనామా నిర్ణయం తన స్వార్థం కోసం కాదని.. మునుగోడు అభివృద్ధి కోసమేనని ఉద్ఘాటించారు. ప్రజలు కోరుకుంటే మళ్లీ మునుగోడు నుంచి పోటీ చేస్తానన్నారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
"ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి అనే మాట చెబుతున్నారు. నేను రాజీనామా చేస్తే అక్కడి ప్రజలకు లబ్ధి జరుగుతుందంటే చేద్దామనుకున్నా. కానీ.. రోజురోజుకూ చర్చ పక్కదారి పడుతోంది. గిట్టని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కవ సమయం వేచి చూసేదానికంటే మీ మనసులో ఏమనుకుంటే అలా చేయండి అని మునుగోడు ప్రజలు చెప్పారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావిస్తున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలి. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందాలా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అభివృద్ధి వద్దా? ప్రజలు ఇతర పార్టీలను గెలిపించడం తప్పా? నా రాజీనామాతో మునుగోడుకు మేలు జరుగుతుందని భావిస్తున్నా. మునుగోడు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. నా నిర్ణయం వల్ల బాధ కలిగితే క్షమించండి. నా నిర్ణయాన్ని స్వాగతించి నాతో రావాలని కోరుతున్నా.నా పోరాటం కుటుంబ పాలనపై. తెలంగాణలోని 4 కోట్ల ప్రజల కోసం.'' అని రాజగోపాల్ స్పష్టం చేశారు.