తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!

లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని గులాబీ దళపతి ముమ్మరం చేశారు. మిర్యాలగూడ బహిరంగ సభ నుంచి మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టి తెరాస శ్రేణుల్లో ఉత్సాహం పెంచారు. భాజపా, కాంగ్రెస్​పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ... దేశ రాజకీయాల్లో మార్పునకై 16 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించాలంటూ కోరారు.

రాస శ్రేణుల్లో ఉత్సాహం నింపిన కేసీఆర్​...

By

Published : Mar 29, 2019, 10:53 PM IST

Updated : Mar 30, 2019, 7:27 AM IST

తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపిన కేసీఆర్​...
దేశంలో ఓ వైపు గాంధీలు... మరోవైపు చౌకీదార్లు... అధికారం కోసం పాకులాడుతున్నారే తప్ప... ప్రజలకు కావాల్సిన సంక్షేమాభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదని గులాబీ అధినేత కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తెరాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్​... భాజపా, కాంగ్రెస్​పై తనదైన చతుర్లతో విరుచుకుపడ్డారు.

చివరి ఎకరాకు కూడా నీళ్లిస్తా...

పంటలు ఎండిపోకుండా చివరి ఎకరానికి కూడా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో అన్నింటా ముందున్న రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, కాలువల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.

బీసీలపై కేంద్రానికి వివక్ష ఎందుకు...

గతంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న మోదీ సర్కారు బీసీలను చిన్నచూపు చూశాయని గులాబీ బాస్​ మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని సూచించినా పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భాజపాకు శంకరగిరి మాన్యాలే...

అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాలకు పోటీ చేస్తే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న భాజపాకు లోక్​సభ పోరు తర్వాత శంకరగిరి మాన్యాలే దిక్కని కేసీఆర్​ ఎద్దేవా చేశారు. తన భరతం పడతానన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ని ప్రజలు భరతం పడతారన్నారు.

దేశ మార్పునకు సర్వ శక్తులొడ్డుతా...

దేశంలో గుణాత్మత మార్పుకోసం సర్వశక్తులు ఒడ్డుతానని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ పెట్టి మార్పులకు శ్రీకారం చుడతానన్నారు. తాను పార్టీ పెట్టేది అధికారం కోసం కాదని... దేశ భవిష్యత్​ బాగుచేసేందుకేనని కేసీఆర్​ ఉద్ఘాటించారు.

16 స్థానాలు గెలిపించి ఆశీర్వదించండి...

నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్​ను దూరంగా పెట్టారన్న కేసీఆర్​... నర్సింహారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 16 స్థానాలు గెలిపించి దేశ రాజకీయాల్లోకి వెళ్లేలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సభలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి, గుత్తా సుఖేందర్​రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. భారీగా ప్రజలు పాల్గొని సభను హోరెత్తించారు.

ఇవీ చూడండి:గాంధీలు, చౌకీదార్లు బీసీలను పట్టించుకోలే!

Last Updated : Mar 30, 2019, 7:27 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details