తెలంగాణ

telangana

ETV Bharat / state

కబ్జా కోరల్లో కల్వలపల్లి చెరువులు - nalgonda

మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ఉన్న చెరువులను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు కబ్జాదారులు. గ్రామాలకు పట్టుకొమ్మలైన చెరువులను కాపాడుకోవాల్సిన రైతులే వాటిపై కన్నేసి కబ్జాలకు పాల్పడుతున్నారు.

కబ్జా కోరల్లో కల్వలపల్లి చెరువులు

By

Published : Jul 18, 2019, 8:57 AM IST

నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఉన్న నల్లచెరువు, గుడి చెరువులో సుమారు 50 ఎకరాలకు పైగా కబ్జా చేశారు. రెవెన్యూ దస్త్రాల ప్రకారం నల్ల చెరువు శిఖం 138 ఎకరాల 34 గుంటలు, గుడి చెరువు శిఖం 65 ఎకరాల 19 గుంటల విస్తీర్ణం కలవు. ప్రస్తుతం ఆ గ్రామానికి చెందిన 20 మంది రైతులు గుడి చెరువులో ఒక్కొక్కరు రెండు నుంచి ఐదు ఎకరాల వరకు కబ్జా చేసి సాగు చేసుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. వరద నీరు ఆ చెరువులోకి రాకుండా చుట్టూ పెద్ద పెద్ద గుండురాళ్లను కట్టలాగా వేసి ఎవరికి వారే హద్దులు చేసుకున్నారు. దీనిని చూసిన మరికొంత మంది రైతులు నల్ల చెరువుపై కన్నేశారు. ఈ ఏడాది కాలంలో రెండు చెరువుల్లో ఇప్పటికే దాదాపు 30 మంది రైతులు 50 ఎకరాలకు పైగా కబ్జా చేసుకున్నారు. అధికారులు పట్టనట్లుగా ఉండటంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు. చెరువు విస్తీర్ణం తెలియకుండా ఉండేందుకు ఎవరికి వారు ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటున్నారు. మిషన్‌ కాకతీయ పనులు చేయించే సమయంలో సంబంధిత శాఖ అధికారులు చెరువు శిఖానికి సంబంధించి ఎలాంటి హద్దులు చూపకుండానే పనులు ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆక్రమణదారులను గుర్తించి వారిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని మునుగోడు తహసీల్దార్ జ్ఞానేశ్వర్‌దేవ్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details