Gutha Sukender Reddy on TS Assembly Elections 2023 :అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ఒకవైపు ఈసారి కేసీఆర్ను గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రతిపక్షాలు బల్ల గుద్ది చెబుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు మూడోసారి తమ సర్కారే అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని జోస్యం చెప్పారు.
Gutha Sukender Comments on Congress :ఈ క్రమంలోనేవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్లు పదవీ కాలం ఉందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పని చేస్తామని.. వారసులకు పదవుల కోసం పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు. వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని గుత్తా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు ఎవరూ వెళ్లే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.