రైతులకు సన్మానం
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుకు సాంకేతికత కూడా చాలా ముఖ్యమే. ఈ విషయంలో తమ మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించిన అన్నదాతలను కృషి విజ్ఞాన కేంద్రం, డాక్టర్ రెడ్డీస్ సంస్థలు ఘనంగా సన్మానించాయి.
ఆరుగాలం శ్రమించే రైతుకు వ్యవసాయంలో నూతన సాంకేతికతను ఎరువుల వాడకంలో సూచనలు మెలకువలు నేర్పించడంలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర చాలా కీలకం. ఇలా అన్నదాతలకు సలహాలు, సూచనలు అందించేందుకు రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో... నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో మిత్ర గ్రూపులను ఏర్పాటు చేసింది. నూతన ఒరవడి యాంత్రీకరణ చీడపీడలను తప్పించే సరికొత్త పద్ధతులను రైతులకు నేర్పించారు. తమ శిక్షణలో అధిక దిగుబడులు సాధించిన వారికి ఇవాళ కృషి విజ్ఞాన కేంద్రం, రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా సన్మానించాయి. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.