నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప మరేదీ కనబడటం లేదని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరఫున రేవంత్ ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలంలోని ఎర్రచెరువు, గొడుమడక, నాయకుని తండా, తిమ్మాయి పాలెం, చింతల పాలెంలో రేవంత్ పర్యటించారు. ప్రచారానికి వచ్చిన తనకు ఘనస్వాగతం పలికినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. జానారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వారంతా నాన్ లోకల్..
ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి నకిరేకల్ నుంచి వ్యక్తి అని రేవంత్ విమర్శించారు. ఎన్నికలు అయిపోతే వారి దారిన వారు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. కానీ జానారెడ్డి మాత్రం ఇక్కడే ఉంటారని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్కు సానుభూతి ఉంటే తెలంగాణ నీళ్ల కోసం పోరాడిన జనార్దన్ రెడ్డి కుమార్తెను ఎందుకు ఏకగ్రీవం చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.