నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా... అధికార తెరాస నేడు హాలియాలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో... 50 వేల వరకు జనసమీకరణ చేపట్టాలని పార్టీ నేతలు చూస్తున్నారు.
50 వేల మంది
ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంటున్న సమయంలో... బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. నల్గొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసే సభకు... సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రానున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి... 50 వేల మందిని తరలించేలా పార్టీ నేతలు దృష్టిపెట్టారు.
విధి విధానాలపై దిశానిర్దేశం
ఇప్పటికే మండలాల ఇంఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులంతా... సభను విజయవంతం చేయాలని చూస్తున్నారు. సాయంత్రం నాలుగింటికి హెలికాప్టర్ ద్వారా అనుములకు చేరుకోనున్న సీఎం... సభాస్థలి సమీపంలోని ఓ ఇంట్లో మండలాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమవుతారు. నాలుగున్నర నుంచి 5 గంటల వరకు భేటీ నిర్వహించి... పోలింగ్‌కు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బహిరంగ సభా వేదికను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు పార్టీ నేతలు పరిశీలించారు. కేసీఆర్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.