నల్గొండ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలపై అవగాహన పూర్వం గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా సాధారణ ప్రసవాలే జరిగేవి. ఉమ్మడి కుటుంబంలో పెద్దలు.. స్త్రీ గర్భం దాల్చిన మొదలు ప్రసవమయ్యే వరకు తీసుకోవాల్సిన ఆహారం, ఇతర జాగ్రత్తలు చెప్పి వారిని మానసికంగా, శారీరకంగా సుఖ ప్రసవాల కోసం సిద్ధం చేసేవారు.
అప్పుడు 80.. ఇప్పుడు 10
మంత్రసానుల కాలంలో 70 నుంచి 80 శాతం సాధారణ ప్రసవాలు జరిగితే... అన్ని రకాల వైద్య సేవలు, గొప్పగొప్ప వైద్య నిపుణులు అందుబాటులో ఉన్న నేటితరంలో 10 శాతం కూడా సాధారణ ప్రసవాలు జరకపోవడం గమనార్హం.
సుఖ ప్రసవంపై అవగాహన
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా నల్గొండ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. వైద్యపరీక్షల కోసం వచ్చే గర్భిణీలకు ఉచిత వాహనం సౌకర్యం, నగదు ప్రోత్సాహం, కేసీఆర్ కిట్లతో పాటు ప్రసూతి వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలతో సుఖప్రసవాల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
సత్ఫలితం
జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాలపై వైద్యులు చేస్తున్న కృషి మంచి సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది జనవరిలో శస్త్ర చికిత్సల ప్రసవాల సంఖ్య 70 శాతం ఉన్నప్పటికీ అక్టోబర్ నాటికి 40 శాతానికి తగ్గడమే ఇందుకు నిదర్శనం.
లాభ నష్టాలు వివరిస్తున్నారు
ఆసుపత్రికి వస్తున్న గర్భిణీలకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం నుంచి కౌన్సెలింగ్ ఇవ్వడం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. గర్భిణీలకు ప్రసూతి సంరక్షణ, ఐరన్ పొలిక్ యాసిడ్ మందుల ఉపయోగం, ఆహారం, విశ్రాంతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవాలతో తల్లిబిడ్డకు కలిగే ప్రయోజనాలు, శస్త్ర చికిత్స వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్నారు.
24 గంటలు అందుబాటులో
తల్లి పాల ప్రాముఖ్యత, కుటుంబ నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళకు సర్కార్ అందించే ప్రోత్సాహం, కేసీఆర్ కిట్టు ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండటం ద్వారా శస్త్ర చికిత్స ప్రసవాలు తగ్గి సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి.
వైద్యుల కృషి
వైద్యరంగంలో మనకంటే ఎంతో ముందున్న యూరోపియన్ దేశంలోనూ నేటికి 80 శాతం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. మన దేశంలోనూ సుఖప్రసవాల శాతం పెంచేందుకు నల్గొండ జిల్లా మాతాశిసు సంరక్షణ కేంద్ర వైద్యులు కృషి చేస్తున్నారు.