తెలంగాణ

telangana

ETV Bharat / state

పంటకు సాయం.. రైతుకు న్యాయం...

లాక్‌డౌన్‌ కారణంగా నిర్వీర్యమవుతున్న రంగాలకు జవసత్వాలు కల్పించేలా ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పథకం కింద ఉద్దీపనలు ప్రకటిస్తున్న కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యవసాయ, అనుబంధ రంగాలలో ప్రగతిని పట్టాలెక్కించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రంగాల్లో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మంది రైతులు, కార్మికులకు భరోసా దక్కనుంది.

athma nirbhar bharat package helps farmers and labor
పంటకు సాయం.. రైతుకు న్యాయం...

By

Published : May 16, 2020, 9:31 AM IST

దేశంలో దాదాపు సగం కంటే ఎక్కువ మంది ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. మొత్తం 11 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజీని ఇస్తున్నామన్నారు. పాడి, మత్స్య కార్మికులకు సైతం ఆర్థిక భరోసా కల్పించారు. దీని వల్ల ఉమ్మడి జిల్లాలో ఈ రంగాలలో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మంది రైతులు, కార్మికులకు భరోసా దక్కనుంది.

‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’కు రూ.20 వేల కోట్లు

దేశంలో మత్స్య సంపదను పెంచి, ఈ రంగంపై ఆధారపడుతున్న వారికి ఆర్థికంగా భరోసాగా నిలిచేందుకు ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కింద రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని మత్స్య కార్మికుల్లో చాలామందికి వ్యక్తిగత బోట్లు, బీమా సౌకర్యం లేదు. ఈ నిధులతో వారికి బీమాతో పాటు పలు షరతులను అనుసరించి వ్యక్తిగత బోట్లు అందనున్నాయి.

నాగార్జునసాగర్‌, మూసీ, డిండి ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరులైన చెరువుల్లోనూ ఈ ఏడాది భారీ స్థాయిలో చేప పిల్లలను వదిలారు. ఈ ఏడాది సాగర్‌లో గరిష్ఠ స్థాయిలో నీటిమట్టం ఉండటంతో ఎడమ కాల్వతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) కింద ఉన్న చెరువులను నింపారు. దిగుబడులు భారీగా వచ్చాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా సదుపాయాలు లేక స్థానిక మార్కెట్లలోనే మత్స్యకారులు చేపలను అమ్ముతున్నారు. వీరికి ఈ సంక్షోభ కాలంలో చేయూత నిచ్చేందుకు ఈ నిధులు ఉపకరించనున్నాయి.

పశువులకు వ్యాక్సిన్‌

పశువులను వెంటాడుతున్న వ్యాధులతో పాడి పరిశ్రమ కింద ఆధారపడి ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసిన ఆర్థిక మంత్రి.. పశువులన్నింటికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

పశు సంవర్థక రంగంలో మౌలిక వసతులకు రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించడంతో ఉమ్మడిజిల్లాలోని అన్ని పశువులకు వ్యాక్సిన్లు వేయించడంతో పాటు ఈ రంగంలో మౌలిక వసతుల కల్పనా పెరగనుంది. గతంలోనే జంతుగణన కింద దాదాపు సగం పశువులకు టీకా కార్యక్రమం నిర్వహించారు. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు 20 నుంచి 25 శాతం పాల డిమాండ్‌తో పాటు సరఫరా తగ్గింది. దీని వల్ల మిగిలిన పాలను సహకార డెయిరీల ద్వారా కొనుగోలు చేశారు. డెయిరీల్లో నమోదైన రైతులకు కేంద్రం రెండు శాతం వడ్డీ రాయితీతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వనుండటంతో డెయిరీల్లో నమోదైన దాదాపు రెండు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

  • ఉమ్మడి జిల్లాలో మత్స్య సంపదపై ఆధారపడినవారు: 50 వేల మంది
  • (మత్స్య సంఘాల్లో నమోదు కానివారు ఇందుకు అదనం)
  • సాధారణ రోజుల్లో చేపలు ఎగుమతయ్యే ప్రాంతాలు: కోల్‌కతా, విశాఖపట్నం, మచిలీపట్నం
  • ఉమ్మడి జిల్లాలో పశు సంపద: సుమారు 11 లక్షలు
  • పాడిపై ఆధారపడిన రైతులు: 3.5 లక్షలు
  • డెయిరీల్లో నమోదైన వారు: సుమారు 2 లక్షలు
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో తగ్గిన పాల సరఫరా: 25 శాతం

స్థానిక ఉత్పత్తులకు క్లస్టర్ల ఏర్పాటు

స్థానిక ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భువనగిరి, బీబీనగర్‌, పోచంపల్లి, నల్గొండ, దేవరకొండ తదితర ప్రాంతాల్లో డెయిరీ, ఇతర పరిశ్రమల కింద స్వయం సహాయక సంఘాల మహిళలు స్థానికంగా కొన్ని ఆహార వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని కుటీర పరిశ్రమలున్నాయి. వీరికి ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.10 వేల కోట్లు కేటాయించారు. దీంతో వీరికి ప్రత్యేక క్లస్టర్‌ గుర్తింపు దక్కడంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యమూ పెరగనుంది.

వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో సగం రాయితీ

రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగైన బత్తాయి, నిమ్మ పంటలకు మార్కెటింగ్‌, రవాణా సదుపాయం లేక చెట్లపైనే ఉండిపోతున్నాయి. ఈ రెండు పంటల సాగుపై ఆధారపడ్డ రైతుల ఆశలు ఈ ఏడాది నీరుగారింది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. ఆపరేషన్‌ గ్రీన్‌ కింద ఈ వస్తువుల సరఫరాలో అయ్యేదానికి కేంద్రం 50 శాతం రాయితీ ఇవ్వనుండటంతో దిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బత్తాయిలను ఎగుమతి చేసే వారికి కాస్త ఊరట లభించనుంది. శీతల గోదాముల్లో పెడితే సైతం 50 శాతం కేంద్రం రాయితీ ఇవ్వనుంది. వీటిపై త్వరలోనే సమగ్రమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిసింది.

వ్యవ..‘సాయం’ చేశారు

వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ప్రకటించడం మంచి నిర్ణయం. వీటితో వ్యవసాయ రంగానికి సాయం చేసినట్లే. పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికీ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. ఈ-మార్కెటింగ్‌ విధానం ద్వారా తమ పంటలను రైతులే దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధానం బాగుంది. ఔషధ మొక్కల సాగుకు రూ.4వేల కోట్ల నిధులు కేటాయించడం అభినందనీయం. లోకల్‌ ఫుడ్‌బ్రాండింగ్‌ ద్వారా స్థానిక అవసరాలను నేరుగా తీర్చే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని నిత్యావసర ఉత్పత్తులపై ధరల నియంత్రణ ఎత్తివేయడం కూడా మంచిదే.

- అల్వాల్‌ రవి, ఎంజీయూ అధ్యాపకుడు.

  • ఉమ్మడి జిల్లాలో..
  • సాగైన బత్తాయి: దాదాపు 50 వేల ఎకరాలు
  • నిమ్మ..: 38 వేల ఎకరాలు
  • వీటిపై ఆధారపడిన రైతులు: సుమారు 60 వేలు

ABOUT THE AUTHOR

...view details