నల్గొండ జిల్లా దామరచర్ల శివారులో ఔషధ పరిశ్రమ నుంచి వెలువడిన వ్యర్థాలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్రోమైట్స్ వ్యర్థాలతో భూగర్భ జలాలు, మూసీ నది కలుషితం అవుతోందని ఆరోపిస్తున్నారు. విషపూరిత రసాయనాలు కలిసిన నీటిని తాగిన పశు పక్షాదులు, చేపలు మృత్యువాతపడుతున్నాయి. వ్యర్థాలు తొలగించాలన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఆదేశాలను పరిశ్రమ యాజమాన్యం బేఖాతరు చేస్తోంది. గుట్టలుగా పోగైన వ్యర్థాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రసాయనాల పీడ.. పంట పొలాలకు చీడ.. కానరాదే ఎవరికి..!
నల్గొండ జిల్లా దామరచర్ల పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది. సిమెంట్, సున్నపు రాయితో పాటు ఔషధ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న క్రోమైంట్స్ వ్యర్థాలతో భూగర్భ జలాలతో పాటు మూసీ నది కలుషితమవుతోంది. ఆ నీటిని తాగుతున్న మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దామరచర్ల శివారులో దాదాపు 70వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగుపడ్డాయి. దక్కన్ క్రోమైట్స్ లిమిటెడ్ పేరుతో సోడియం డైక్రోమైట్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశారు. స్థానికుల అభ్యంతరంతో చాలా ఏళ్ల కిందట పరిశ్రమ మూతపడింది. లాభాలు గడించిన యాజమాన్యం వ్యర్థాలను మాత్రం అక్కడే గుట్టలుగా పోసి వదిలేశారు. వ్యర్థ రసాయనాలు పక్కనే ఉన్న బుగ్గవాగులో కలవడం వల్ల నీరు రంగు మారి అక్కడి నుంచి మూసీలోకి చేరుతున్నాయి. అవే నీరు కృష్ణా నదిలోనూ కలుస్తున్నాయి. ఫలితంగా స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రసాయన వ్యర్థాల పీడ నుంచి శాశ్వత విముక్తి కల్పించాలని దామరచర్ల వాసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: