తమకు న్యాయం చేయాలంటూ నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ మహిళ కుమార్తెలతో సహా నిరసనకు దిగింది. దివ్యాంగుల కోటాలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మరో వ్యక్తి ఆక్రమించుకున్నారని అధికారుల స్పందించి న్యాయం చేయాలని కోరింది.
నిడమనూరు మండలం ఉట్కూరుకు చెందిన బెజవాడ వెంకటేశ్వరులు, సుశీలకు దివ్యాంగుల కోటాలో 1991లో ప్రభుత్వం వేంపాడు శివారులో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమిని ఆదే గ్రామానికి చెందిన నారాయణకు కౌలుకు ఇచ్చారు. కొన్నాళ్లు సక్రమంగా కౌలు చెల్లించిన నారాయణ, ఆ తర్వాత భూమిని తన పేరుతో పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు.