తెలంగాణ

telangana

ETV Bharat / state

'సింగపట్నం' పిలుస్తోంది... 'సింగోటం' రారమ్మంటోంది!

చుట్టూ పచ్చని పొలాలు... మధ్యలో కోనేరు... పక్కనే కొండ మీద కొలువై ఉన్న లక్ష్మీ దేవి. ఆ పక్కనే సతీసమేతంగా లక్ష్మీ నారసింహుడి ఆలయం... చూస్తే... మనసు భక్తి పారవశ్యంతో నిండిపోవాల్సిందే. ఇంకా ఈ స్వామి... జాతర కోసం ముస్తాబయితే చూడటానికి రెండు కళ్లు చాలవనుకోండి. ఈ భక్తిభావంతో కూడిన అదృష్టం దక్కాలంటే సింగోటం జాతరకు వెళ్లాల్సిందే...

singotam jathara
సింగోటం.. కోరిన కోర్కెలు తీర్చే దైవక్షేత్రం

By

Published : Jan 15, 2020, 8:06 AM IST

సింగోటం.. కోరిన కోర్కెలు తీర్చే దైవక్షేత్రం

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణానికి దగ్గర్లో సింగోటం దేవస్థానం ఉంది. లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి అక్కడ వెలసి ఉన్నారు. జటప్రోలు సంస్థానాధీశుడు రాజ సింగమనాయుని పాలనకాలంలో ఈ దేవాలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది. వెయ్యేళ్ల కిందట ఆ ప్రాంతంలో రైతు పొలం దున్నుతుండగా ఓ శిల అడ్డుతగిలేదట. కొన్నేళ్ల తర్వాత ఆ సంస్థానాన్ని పరిపాలిస్తున్న సింగమనాయునికి స్వామి కలలో కనిపించి తక్షణం తనను ప్రతిష్టింపజేయాలని చెప్పారట. అదే రాత్రి తన బలగంతో రైతు పొలానికి వెళ్లిన సింగమనాయుడు స్వామివారిని గుర్తించి విగ్రహాన్ని ప్రతిష్టింప జేశారు.

శివకేశువులనే భేదం లేకుండా..

అప్పట్లో చిన్నదిగా ఉన్న గుడిని రాణి రత్నమాంబ పునరుద్ధరించారని శాసనాలు చెబుతున్నాయి. సింగపట్నం లక్ష్మీనారసింహున్ని భక్తులు శ్రీవారని, స్వామివారి చెంతనే ఉన్న కోనేరును శ్రీవారి కోనేరని, పక్కనే ఉన్న తటాకాన్ని శ్రీవారి సంద్రంగా పిలుస్తారు. స్వామి వారి ఆలయానికి కిలోమీటరు దూరంలో గుట్టపై లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కొండను రత్నగిరిగా పిలుస్తుంటారు. సింగపట్నంలో శివకేశవులనే భేదం లేకుండా ఆలయంలో శివలింగం, ఆంజనేయస్వామి, వినాయక విగ్రహాలున్నాయి.

రథోత్సవానికి లక్షల్లో భక్తులు

ఏటా మాఘమాసంలో మకర సంక్రమణను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు శకటోత్సవం, పల్లకీ సేవ, 16న స్వామివారి కల్యాణ మహోత్సవం, 17న ప్రభోత్సవం, సింహ వాహన సేవ, 18న రథోత్సవం, 19న తెప్పోత్సవం, 20న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అన్ని ఘట్టాల్లోకెల్లా రథోత్సవం కీలకమైంది. ఈ రథోత్సవాన్ని, సింగోటం జాతరగా, తేరుగా భక్తులు పిలుస్తారు. ఈ ఒక్కరోజే సుమారు లక్షకుపైగా భక్తులు సింగపట్నానికి తరలి వస్తారు. ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, శ్రీలంక, నేపాల్ నుంచి కూడాభక్తులు వస్తుంటారు.

ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలు..

స్వామివారి జాతర కోసం సింగపట్నం ముస్తాబవుతోంది. భక్తుల సౌకర్యార్థం పర్యటక శాఖ, దేవస్థానం అధ్వర్యంలో కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు బస కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 80 వేల మందికి సరిపోయే అన్నదానం, మంచినీళ్లు, మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?

ABOUT THE AUTHOR

...view details