నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలోని రంగాపూర్ గ్రామ సర్పంచ్ చింత ఝాన్సీ ఆత్మహత్యకు యత్నించారు. అధికారులు సహకరించడం లేదని, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఓ లేఖ రాసి నిద్ర మాత్రలు మింగారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అధికారులు సహకరించటం లేదని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం - nagarkarnool news
గ్రామంలో తలపెట్టిన అభివృద్ధి పనులకు అధికారులు సహకరించటంలేదని ఓ సర్పంచ్ ఆత్నహత్యకు యత్నించారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసి... తమ కుటుంబసభ్యులను జైల్లో పెట్టించారని.. తాను సర్పంచిగా ఉండి లాభం ఏముందని లేఖ రాసిపెట్టి మరీ ఆత్మహత్యాయత్నం చేశారు.
గ్రామంలో ప్రకృతి వనానికి స్థలం కేటాయించాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేయగా... వారు వచ్చి గ్రామకంఠం భూమి 3.32 ఎకరాలను పంచాయతీకి అప్పగించారని లేఖలో తెలిపారు. ఆ భూమి గ్రామ కంఠానిది కాదని.. తమదని అదే గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ వ్యక్తి దౌర్జన్యంగా తమపై కేసు పెట్టి తన తండ్రి, అన్నయ్యతోపాటు 8 మందిని 20 రోజులుగా జైలులోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు సహకరించడంలేదని... తాను సర్పంచిగా ఉన్నా ఫలితం ఏముందని... ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై బాలకృష్ణ తెలిపారు.