కందనూలు కోటపై తెరాస జెండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న లోక్‌సభ నియోజకవర్గం నాగర్ కర్నూల్. ఈ పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల, అలంపూర్, వనపర్తి శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానంలో 9 లక్షల 92 వేల 226 ఓట్లు పోల్ అవగా.. రాములుకు లక్షా 87 వేలకుపైగా మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు. 15 లక్షల 87 వేల 281 ఓట్లు ఉన్న కందనూలు స్థానంలో రాములుకు 4 లక్షల 54 వేల 822 ఓట్లు వచ్చాయి.
ఎస్సీ కోటా కింద రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస తరఫున మాజీ మంత్రి పోతుగంటి రాములు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, భాజపా అభ్యర్థిగా బంగారు శ్రుతితో సహా మొత్తం 11 మంది పోటీ పడ్డారు.
బ్రేకులు వేయలేకపోయింది:
నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది సార్లు గెలిచినా.. ఈసారి కారు వేగానికి బ్రేకులు మాత్రం వేయలేకపోయింది. ఇంతకుముందు ఎన్నికల్లో 4 సార్లు తెలుగుదేశం, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులు గెలుపొందారు. మాజీ ఎంపీ మంద జగన్నాధం నాలుగు సార్లు ఇదే నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు.
తెరాస హవానే కారణమా..?
వివాద రహితుడు, సౌమ్యుడుగా పేరున్న మాజీ మంత్రి, అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు పోతుగంటి రాములును తెరాస రంగంలోకి దింపింది. గెలుపు బాధ్యతను సీఎం కేసిఆర్ మంత్రి నిరంజన్‌రెడ్డికి అప్పగించారు. అభ్యర్థికున్న మంచిపేరు, శాసనసభ ఎన్నికల్లో తెరాస హవా, ప్రభుత్వ పథకాలు... రాములు గెలుపుకు కారణమైనట్లు తెలుస్తోంది.
సీనియర్ నేతలు పార్టీ వీడటం
సిట్టింగ్ ఎంపీ స్థానంపై మరోసారి విజయ బావుటా ఎగుర వేసేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు రచించినా ఫలితం దక్కలేదు. ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్.. మాజీ ఎంపీ మల్లు రవిని బరిలో నిలిపింది. ప్రజల బాగోగులు పట్టించుకునే ప్రజాప్రతినిధిగా మంచి పేరున్న మల్లురవికి ప్రజలు 2 లక్షల 81 వేల 737 ఓట్లు కట్టుబెట్టారు. పార్టీ సీనియర్ నేతలు చిత్తరంజన్ దాస్, డీకే అరుణ పార్టీని వీడటం కాంగ్రెస్‌ను పరోక్షంగా దెబ్బతీసినట్లు సమాచారం.
కమలానికి నిరాశే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖాతా తెరవాలని భావించిన భాజపాకు నిరాశే మిగిలింది. ఎస్సీ సెల్ జాతీయ నాయకురాలు బంగారు శ్రుతికి లక్షా 16 వేల 283 ఓట్లు నమోదు అయ్యాయి. కమలం పార్టీకి కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పట్టున్నా.. అంతగా ప్రభావం చూపలేకపోయింది.
ఇవీ చూడండి: తెలంగాణలో గెలిచిన ప్రశ్నించే గొంతుక