ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులు నీరు లేక ఒట్టిపోతున్నాయి. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తేనే దిగువకు వరద జలాలు వచ్చే సూచనలున్నాయి. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు వరద జలాలే ఆధారం. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరద జలం మాటే వినిపించడం లేదు. వరదొస్తేనే ఖరీఫ్‌కు సాగునీరు లభిస్తుందని భావించిన ఇక్కడి ప్రాంత రైతులు, ప్రజలు కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు పడాలంటూ కోరుకుంటున్నారు.
వరద నీరే వరప్రదాయిని
కృష్ణ, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో నుంచి వచ్చే వరదనీరే పాలమూరు ప్రజలకు వరప్రదాయినిగా మారుతుంది. నేరుగా కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు ద్వారా దాదాపు 6.67 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే వివిధ ప్రాజెక్టులను చేపట్టారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మరో 5.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇందులో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 2 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ జలాశయం ద్వారా 57 వేల ఎకరాలు, భీమా- 1, భీమా- 2 ప్రాజెక్టుల ద్వారా 2.30 లక్షల ఎకరాలకు, రామన్‌పాడు ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని ఈ ప్రాజెక్టులను రూపొందించారు.
తుంగభద్ర నదికి వచ్చే వరద నీటిని వినియోగించుకునేందుకు నిర్మించిన రోజోలిబండ మళ్లింపు (ఆర్‌డీఎస్) పథకం ద్వారా 87 వేల ఎకరాలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా 55 వేల ఎకరాలకు సాగునీరందిచాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. శ్రీశైలం తిరుగుజలాల ఆధారంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.23 లక్షల ఎకరాలు సాగునీటిని అందించాలన్న లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందడానికి కృష్ణ, తుంగభద్ర పరివాహక పాంతాల్లో నుంచి వచ్చే వరదనీరే ప్రధాన ఆధారం.