Medaram Tollgate charges : మేడారం జాతరకొచ్చే భక్తులకు టోల్‌గేట్ ఛార్జీలు అదనపు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్ నుంచి మేడారానికి రావాలంటే... యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల, హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం కోమటిపల్లి, ములుగు జిల్లా జవహర్ నగర్ వద్ద 4 టోల్‌గేట్లు ఎదురవుతాయి. కరీంనగర్ నుంచి వచ్చేవారు మూడుటోల్ గేట్లు దాటాల్సి వస్తోంది. చాలామంది భక్తులు ప్రైవేట్‌వాహనాల్లో వస్తుండటంతో.... నాలుగు నుంచి 500 రూపాయల వరకు టోల్‌ఛార్జీల కిందనే చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లా జవహర్‌నగర్ వద్ద వారంపాటు... అధికారులు టోల్‌గేట్ రుసం చెల్లింపు నిలిపివేశారు. హైదరాబాద్, కరీంనగర్ మార్గాల్లో టోల్‌గేట్ల వసూళ్లు నిలిపివేస్తే మేడారం మహా జాతరకొచ్చే వారికి కష్టాలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. జాతర జరిగే నాలుగైదు రోజుల్లోనైనా టోల్‌ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు . ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి..!
మరోవైపు మేడారం మహా జాతరకు... ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు... వనదేవతలను దర్శించుకుని ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. బుధవారం నాడు మండమెలిగే పండుగతో... జాతర సందడి మొదలైంది. పూజారులు దిష్టితోరణాలు... కట్టి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దాదాపు కోటి మంది భక్తులు
మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర... తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారంలో రెండేళ్లకోసారి అంగరంగవైభవంగా నిర్వహించే మహా గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దాదాపు కోటిమంది వస్తారని అంటారు.