హైదరాబాద్ నుంచి రామప్ప ఆలయం 209 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ మీదుగా ములుగు జిల్లా జంగాలపల్లి వరకు వెళ్లాక అక్కడి నుంచి ఎడమ వైపు 9 కిలోమీటర్లు వెళితే రామప్ప ఆలయాన్ని చేరుకోవచ్చు. యాత్రికులు బస చేసేందుకు హరిత హోటల్ కాటేజీలు, రెస్టారెంటు ఉన్నాయి. ఆలయాన్ని దర్శించుకొనే క్రమంలో గైడ్ చెప్పే విశేషాలను తప్పకుండా వినాలి. అప్పుడే అక్కడి శిల్పాల్లోని విశేషాలు, శిల్పుల గొప్పతనం అర్థమవుతాయి. సమీపంలోని సరస్సులో బోటింగ్ చేయవచ్చు. చుట్టూ పచ్చని అడవి, పంటపొలాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కుటుంబంతో వెళ్లి హాయిగా ఈ ప్రాంతంలో బస చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయి.
రైలు మార్గంలో ఇలా..
రైల్లో అయితే కాజీపేట లేదా వరంగల్‌లో దిగాలి. హన్మకొండ బస్టాండ్ నుంచి ఏటూరునాగారం వెళ్లే బస్సు ఎక్కి జంగాలపల్లి వద్ద దిగాలి. అక్కడి నుంచి ఆటోల్లో రామప్ప గుడికి చేరుకోవచ్చు. సొంత వాహనాలైతే సౌకర్యంగా ఉంటుంది. హన్మకొండ నుంచి సుమారు 70 కి.మీ. దూరంలో ఉంటుంది.
లక్నవరం
రామప్ప నుంచి 30 కి.మీ.
చూడాల్సిన ప్రదేశాలు:సరస్సు, తీగెల వంతెనలు, బోటింగ్, జింకలపార్కు
అతి పెద్ద సరస్సు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో లక్నవరం సరస్సు ఉంది. దీనిపై మూడు తీగెల వంతెనలు ఉన్నాయి. దగ్గరలో జింకల పార్కు ఉంది. సీజనల్‌గా పిల్లలకు సాహస క్రీడలు నిర్వహిస్తారు. వారాంతాల్లో అడవుల్లో ట్రెక్కింగ్ ఉంటుంది..
వసతులు: రెస్టారెంట్, 12 కాటేజీలు ఉన్నాయి.
పాకాల సరస్సు
రామప్ప నుంచి 63 కి.మీ.
చూడాల్సిన ప్రదేశాలు:జీవవైవిధ్య పార్కు, బోటింగ్, పాకాల అభయారణ్యం తిలకించవచ్చు.
జీవ వైవిధ్యానికి నిలయం: వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల సరస్సు ఉంది. కాకతీయుల రాజైన గణపతిదేవుడు 1213లో నిర్మించిన ఈ పెద్ద సరస్సు జీవ వైవిధ్యానికి నిలయం. సరస్సులో మొసళ్లు ఉంటాయి. పరిసరాల్లో సుమారు వంద రకాల పక్షి జాతులు, 40 వరకు సీతాకోకచిలుక జాతులు ఉంటాయి. పాకాల అభయారణ్యం 900 చదరపు కిలోమీటర్లలో పరిధిలో విస్తరించింది ఉంది. ఒకప్పుడు ఇక్కడ పెద్దపులులు సంచరించేవి.
కళల జల్లు ఓరు‘గల్లు’..
చూడాల్సినవి:వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, జూపార్కు, సైన్స్ మ్యూజియం.
వేయిస్తంభాల గుడి: క్రీ।।శ 1163లో కాకతీయరాజు రుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ మూలవిరాట్టు రుద్రేశ్వరుడు. పెద్ద, చిన్న స్తంభాలు 1,000 వరకు ఉంటాయి కాబట్టి వేయిస్తంభాల గుడి అనే పేరొచ్చింది. సన్నటిదారం పట్టేంత సూక్ష్మ రంధ్రాలతో అద్భుతమైన శిల్ప సంపద కనువిందు చేస్తుంది. కృష్ణ శిలతో చెక్కిన ఏకశిలా నంది ప్రత్యేక ఆకర్షణ. కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకం కింద ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది.
కళానిలయం శిలాతోరణం: వరంగల్ కోట అనేక చారిత్రక కట్టడాలకు నిలయం. కాకతీయులు 12వ శతాబ్దంలో ఈ కోటను రాజధానిగా చేసుకొని పాలించారు. చుట్టూ ఏడు కిలోమీటర్ల మట్టి కోట, తర్వాత నాలుగు కిలోమీటర్ల రాతి కోట ఉంటుంది. పదుల సంఖ్యలో ఆలయాలు అద్భుతంగా నిర్మించారు. ఎంతోమంది విదేశీయులు పరిశోధనలు చేయడానికి వస్తుంటారు. నాలుగు శిలాతోరణాల మధ్య ఒకప్పుడు సర్వతోభద్ర ఆలయం ఉండేదని చెబుతారు. కోటలో రాత్రివేళ సౌండ్ అండ్ లైట్ షో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో కూడా పెట్టారు.
వసతులు:విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి.
కోటగుళ్లు
రామప్ప నుంచి 9 కి.మీ.