రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు పొందడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయమని కొనియాడారు.
"దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు. రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళలకు, వారసత్వానికి నిదర్శనం. అక్కడి శిల్పకళా వైభవాన్ని అనుభూతి చెందటానికి ప్రతీ ఒక్కరు రామప్పను సందర్శించాలని కోరుతున్నా"- నరేంద్ర మోదీ, ప్రధాని.
దేశం గర్వించదగిన క్షణం..
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కటంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
"యునెస్కో గుర్తింపు యావత్ దేశానికి ఆనందకరమైన విషయం. రామప్ప ఆలయం భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి, హస్తకళకు ప్రతీక. భారతీయ శిల్పకళకు చక్కని ఉదాహరణ.. రామప్ప గుడి. ఇది దేశం మొత్తం గర్విచదగిన క్షణం." - అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్‌లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ఆలయ విశిష్టతలను చూసి అచ్చెరువొందారు. ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించారు. తమ ఓట్లతో రామప్ప ఖ్యాతిని మరింత పెంచుతూ... ప్రపంచ వారసత్వ గుర్తింపునిచ్చారు.
వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం... ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16న ప్రారంభమైంది. గతేడాది జూన్‌లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన కట్టడాలపై ముందుగా ప్రతినిధులు చర్చించి అనంతరం.. ఓటింగ్ జరుపుతారు. దాదాపు 21 మంది దేశాల ప్రతినిధులు రామప్పకు ఆమోదం తెలుపడంతో... ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.
ఇదీచూడండి:RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు