ములుగు జిల్లాలోని పంచాయతీల పాలనకు సంబంధించి జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం వరించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన "నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతాత్ వికాస్ పురస్కారం" కోసం దేశంలో మూడు జిల్లాలను ఎంపిక చేయగా అందులో ములుగు జిల్లాకు రెండో స్థానం దక్కింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 9 అంశాల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పనితీరు ఆధారంగా 8 మండలాల్లోని 27 గ్రామాలు జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలోనూ అవార్డులకు ఎంపికయ్యాయి.
మౌలిక సదుపాయాలపై రాష్ట్రస్థాయి అవార్డు:ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామం మౌలిక సదుపాయాలపై రాష్ట్రస్థాయి అవార్డును గెలిచింది. దేశంలోని 766 జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ అవార్డులో పాల్గొనగా వాటి ప్రదర్శన ఆధారంగా ములుగు జిల్లాకు అవార్డు ప్రకటించడం ఎంతో గర్వంగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. ఈనెల 17న దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు, 3కోట్ల క్యాష్ రివార్డును అందుకోనున్నారు. ములుగు జిల్లాకు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ సతాత్ పురస్కారం రావడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో మొదటి బహుమతి పొందేందుకు కృషి చేస్తామంటున్నారు.
4విభాగాల్లో నంబర్ వన్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2023 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాష్ట్రానికి చెందిన గ్రామ పంచాయతీలు పలు అవార్డులను దక్కించుకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు 46 అవార్డులు ప్రకటించగా... అందులో తెలంగాణకు ఏకంగా 13 అవార్డులు లభించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకల్లా అగ్రస్థానంలో నిలిచింది. "దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్" పురస్కారాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 27 అవార్డులు ప్రకటిస్తే అందులో ఏకంగా 8 అవార్డులు రాష్ట్రానికి దక్కడం విశేషం. మొత్తం 9 కేటగిరీలు ఉండగా అందులో 4 విభాగాల్లో రాష్ట్రానికే మొదటి స్థానం దక్కింది. ఉత్తమ జిల్లా కేటగిరీలో ములుగు జిల్లాకు రెండో స్థానం దక్కింది. ఈ నెల 17న దిల్లీ వేదికగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేస్తారు.
భారీగా నజరానా:జాతీయ గ్రామపంచాయితీలో స్థానం దక్కించుకున్న జిల్లాలు, గ్రామాలకు భారీ నజరానా అందనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరుగనుంది. అవార్డు దక్కించుకున్న పంచాయితీలకు కేంద్రం రూ.7.15 కోట్లను అందించబోతుంది. తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచిన 4 పంచాయితీలకు రూ.50లక్షల చొప్పున నగదు బహుమతి అందనుంది. రెండో స్థానంలో పంచాయితీలకు రూ.40లక్షలు, మూడో స్థానంలో నిలిచిన పంచాయితీలకు రూ.30లక్షలు అందనున్నాయి.
ఇవీ చదవండి: