Ramappa Temple: రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక కట్టడం. కాకతీయులు మేధోసంపత్తిని, గజ, అశ్వ, సైనిక బలాలను ఉపయోగించి ఇసుక దిబ్బపై ఎంతో నేర్పు, పరిజ్ఞానంతో నిర్మించిన రాతి కట్టడం అధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. పురావస్తుశాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటా వర్షాకాలంలో ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రామప్ప ఆలయం చుట్టూ వరదనీరు చేరుతోంది. నలుమూలలా మురుగుకాల్వల్లో పూడిక మట్టి చేరింది. రామప్ప ఉపాలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
గతంలో తలెత్తిన సమస్యలు..
* 2020లో ఆలయం ఈశాన్యభాగంలోని ప్రహరీ వర్షాలకు కూలింది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు.
* 2017లో ఆలయానికి వెళ్లే మార్గంలో.. ప్రస్తుత పార్కింగ్ స్థలానికి దగ్గరలోని శివాలయం కూడా కూలిపోయింది. దీనిని పునరుద్ధరించలేదు.
* 2015లో నీరు లీకవుతున్న ప్రాంతాలను గుర్తించి పైభాగంలోని ఒక పొరను పూర్తిగా తొలగించారు. కొత్తగా మళ్లీ శ్లాబ్ వేసినా ఫలితం లేకపోయింది.