DGP meeting with officials in Mulugu: తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ కొనసాగించే విధంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిరంతరం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పోలీస్ స్టేషన్‌లో మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మావోయిస్టుల్లో ప్రతి 20 మందిలో మన రాష్ట్రానికి సంబంధించిన వారే 11మంది మావోయిస్టులు ఉన్నారని డీజీపీ తెలిపారు. మావోయిస్టు పార్టీలో 130 మంది వరకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు అజ్ఞాతంలో ఉంటూ ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా.. పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
అలా వచ్చిన వారికి మెరుగైన వైద్యంతో పాటు మంచి పారితోషకం ఇచ్చి సమాజంలో గౌరవ ప్రదంగా చూడటం జరుగుతుందని ఆయన అన్నారు. సమావేశంలో ఆయనతో పాటు అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రిత్విక్ రుద్ర, జిల్లా ఎస్పీ గణపతిరావు పాటిల్, ఏఎస్పీ అశోక్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
"ప్రతి 20 మంది మావోయిస్టులలో మన రాష్ట్రానికి సంబంధించిన వారే 11మంది ఉన్నారు. మావోయిస్టు పార్టీలో 130 మంది వరకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు ఉన్నారు. అజ్ఞాతంలో ఉంటూ ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా.. పార్టీని వీడి జనజీవన స్రవంతిలో వారు కలవాలి. వారికి ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తాం.. వారికి మెరుగైన వైద్యం అందించి వారి జీవితానికి మెరుగైన భరోసా కల్పిస్తాం".- మహేందర్‌రెడ్డి, డీజీపీ
మావోయిస్టులు అజ్ఞాతంలో ఉంటూ ఆరోగ్యాలు పాడుచేసుకోకండి: డీజీపీ ఇవీ చదవండి: