ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తనిధి కేంద్రంలో కనిపించని రుధిరం - రక్తనిధి కేంద్రంలో కనిపించని రుధిరం

ములుగు ఏరియా ఆసుపత్రికి రక్తనిధి కేంద్రం మంజూరై రెండేళ్లయింది. యంత్రాలు వచ్చి ఏడాదైనా ఇప్పటి వరకు చుక్క రక్తాన్ని నిల్వ చేయలేదు. రక్త నిధి కేంద్రం కొనసాగాలంటే కేంద్ర ప్రభుత్వ డ్రగ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ నుంచి అనుమతి పొందాలనే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అందుకే అన్ని వసతులు అందుబాటులో ఉన్నా రక్తనిధి కేంద్రం ఎందుకూ పనికిరాకుండా పోతోంది.

రక్తనిధి కేంద్రంలో కనిపించని రుధిరం
author img

By

Published : Jul 10, 2019, 2:37 PM IST

ములుగు ఏరియా ఆసుపత్రికి మంజూరైన రక్త నిధి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. రక్తం లేని కేంద్రంగా మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల స్థాయికి పెంచిన తర్వాత ప్రత్యేకంగా ప్రభుత్వం రక్త నిధి కేంద్రాన్ని మంజూరు చేసింది. కేంద్రానికి సంబంధించి యంత్రాలు వచ్చి ఏడాదైంది. పనులు పూర్తి కాకముందే జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ ఆరంభ శూరత్వంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చుక్క రక్తాన్ని అందులో నిల్వ చేయలేదు.

గర్భిణులకు ఎంతో ఉపయోగం

రక్త నిధి కేంద్రం అందుబాటులో ఉంటే గర్భిణులకు ఎంతో ఉపకయోగకరంగా ఉంటుంది. డెంగీ లాంటి వ్యాధుల బారిన పడిన వారికి, రక్తకణాలు తక్కువ ఉన్న వారికి వాటిని ఎక్కించేందుకు ఈ కేంద్రం ఎంతో తోడ్పడుతుంది. ప్రస్తుతం అది అందని ద్రాక్షలానే మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిలో నెలలో సుమారు 150 నుంచి 180 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. రక్తనిధి కేంద్రంలో అన్ని రకాల రక్త నిల్వలు అందుబాటులో ఉంటే వెంటనే కాన్పు కోసం వచ్చి రక్తం కొరతతో ఇబ్బంది పడేవారికి వెంటనే రక్తం ఎక్కించి బతికించే అవకాశాలున్నాయి. చాలా సార్లు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని కాన్పులు చేస్తున్నారు. డెంగీ లాంటి వ్యాధి సోకిన వారు ఇక లాభం లేదనుకొని వరంగల్‌ లాంటి ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. రక్తహీనత ఉందనే కారణంతో కొందరు గర్భిణులను వరంగల్‌ లాంటి ఆసుపత్రులకు సిఫారసు చేసిన సందర్భాలున్నాయి.

కేంద్ర డ్రగ్‌ లైసెన్స్‌ పేరుతో జాప్యం

రక్త నిధి కేంద్రం కొనసాగాలంటే కేంద్ర ప్రభుత్వ డ్రగ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ నుంచి అనుమతి పొందాలనే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. లైసెన్స్‌ పొందడంలో సంబంధిత శాఖ అలసత్వం ప్రధానంగా కనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా లైసెన్స్‌ రాకపోవడానికి గల కారణాలేమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసి నెలలు దాటుతున్నా ఆ అనుమతులు రావడం లేదు. దాంతో అన్ని వసతులు అందుబాటులో ఉన్నా రక్తనిధి కేంద్రం ఎందుకూ పనికిరాకుండా పోతోంది.

ఇదీ చదవండిఃరుణమాఫీపై అయోమయంలో అన్నదాతలు

ABOUT THE AUTHOR

...view details