మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని సైనిక్‌పురిలో నర్సింహారెడ్డి అనే వ్యాపారి ఇంట్లో గత రాత్రి జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. జులై 29న కుమారుడి వివాహం జరగగా ఆదివారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రిసెప్షన్ జరిగింది. బంధువులతో కలిసి సాయంత్రం 5 గంటల సమయంలో ప్యాలెస్‌కి వెళ్లారు. వేడుకను ముగించుకుని వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం, ఇంట్లోని నాలుగు బీరువాలు ధ్వంసం అయి ఉన్నాయి. నగలు డబ్బు కనిపించకపోవడం వల్ల చోరీ జరిగిందని గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా..
వ్యాపారి ఇంట్లో పనిచేసే భీమ్ అతని భార్య కనిపించకపోవడం వల్ల కుషాయిగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో మొత్తం 1.7కేజీల బంగారం, 2లక్షల నగదు, ఎలక్ట్రానిక్ సామగ్రి మాయమైనట్లు పేర్కొన్నారు. పోలీసులు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తితో పాటు అతని భార్య చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఏడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.ఇంటి యజమాని నర్సింహారెడ్డి వద్ద పని చేస్తున్న వారి వివరాలు పోలీసులు సేకరించారు. అనంతరం వారి మొబైల్ సిగ్నల్, వాళ్లు వెళ్లిన దారిలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పని చేసే వారితో పాటు చోరీకి మరొకరు సహాయం చేసినట్లుగా గుర్తించామని డీసీపీ రక్షిత తెలిపారు. చోరీ తర్వాత సైనిక్‌పురి కూడలి వద్ద వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.