Revanthreddy Comments on CM KCR and KTR : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తూ.. ఒకరి వైఫల్యాలు మరొకరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ఇప్పటికే నాయకుల వలసల బాట మొదలయింది. తాజాగా ఇవాళ మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూముకుంట ముస్సిపల్ కేంద్రంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు యువకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్... బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Revanthreddy Latest Comments : తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ బానిసలుగా మార్చాలని చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిఆరోపించారు. మూడోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న రేవంత్... తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండని ధ్వజమెత్తారు. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్ అన్నారు. ముఖ్యమంత్రి లాగే ఆయన కొడుకు మోసం చేస్తాడే తప్ప ప్రజల కోసం ఆలోచించడని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రాజకీయంగా నష్టపోయినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్న రేవంత్... ఆమెకు కృతజ్ఞత తెలిపే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు.
'రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఉండాలని మీరంతా ఇక్కడ నన్ను ఎంపీగా గెలిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించా ?పేదల కష్టాల గురించి కేసీఆర్ ఆలోచించరు. ఎక్కడ చూసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. పోలీసులకు, పాత్రికేయ మిత్రులకు కూడా మేలు చేయలేదు.పేదలకు డబుల్ బెడ్రూం ఇస్తానని మాట తప్పారు. 1200 మంది అమరుల త్యాగాలను చులకన చేస్తూ నిన్న కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ బిడ్డల ప్రాణాల విలువ నీకు తెలుసా కేసీఆర్ ?'-రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు