కేంద్రం ఇచ్చినా... ఇవ్వక పోయినా.. రాష్ట్రంలో సంక్షేమం ఆగదు KTR tour in Medchal: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ప్రాంత వాసుల చెత్త సమస్యను పరిష్కరించామని.... 147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాపింగ్ చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపాలిటీల్లో పర్యటించిన మంత్రి... మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని చంగిచెర్లలో 110 కోట్లతో చేపట్టనున్న ఎస్ఎన్డీపీ పనులకు శంకుస్థాపన చేశారు. బొడుప్పల్‌లో ఎఫ్ఎస్టీపీ సెంటర్‌ను... మేడిపల్లిలో వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
జవహర్ నగర్ ప్రాంత పరిధిలో 250 కోట్ల రూపాయలతో మురికినీటిని శుద్ధి చేసే పనులూ జరుగుతున్నాయని వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్‌లో పర్యటించిన కేటీఆర్... మంత్రి మల్లారెడ్డితో కలిసి 303 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జవహర్‌నగర్‌లో చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.
బడ్జెట్‌తో పేదలకు ప్రయోజనం లేదు
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పేదలకు పనికొచ్చేది ఏదీ లేదని తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపెట్టారని మంత్రి విమర్శించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా... అన్నింటిని బుట్ట దాఖలు చేశారని అన్నారు. కేంద్రం ఇచ్చినా... ఇవ్వక పోయినా... ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో.... తెలంగాణ రాష్ట్రం ఇదే రీతిలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నవారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. జీవో 58,59 ద్వారా ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. డంపింగ్ యార్డుల్లో రూ.147 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ చేశామని పేర్కొన్నారు. చెరువులు కలుషితం కాకుండా రూ.250 కోట్లతో లిచింగ్ చేశామన్నారు. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలించామని స్పష్టం చేశారు. మౌలిక వసతులకు కేంద్రం బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదన్న మంత్రి... కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆగవని తెలిపారు. మనఊరు-మనబడి కింద రూ.7289 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు.
కేంద్ర బడ్జెట్‌లో పేదలకు పనికొచ్చేది ఏదీ లేదు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపెట్టారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. అన్నింటిని బుట్ట దాఖలు చేశారు. కేంద్రం ఇచ్చినా, ఇవ్వక పోయినా, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. మౌలిక వసతులకు కేంద్రం బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆగవు.
- కేటీ రామారావు, పురపాలక శాఖ మంత్రి
శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు వందల కోట్లు కేటాయిస్తున్నారు మంత్రి కేటీఆర్. చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించామని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు కానీ... గుజరాత్‌లో వరదలకు మాత్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రం నిన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఏ వర్గానికి ప్రయోజనం కలిగేలా లేదని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని మరోసారి పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి:CM KCR on Drugs: 'డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు'