Contaminated water in Jeedimetla: మీరు ఎప్పుడైనా బోరింగ్ నుంచి రసాయనాలు, రంగునీళ్లు రావడం చూశారా, జీడిమెట్లకు రండి.. అక్కడ 18 కాలనీల్లో ఎక్కడ బోరు వేసినా రసాయనాలు కలిసిన ఎర్రటి నీళ్లు భూగర్భంలోంచి వస్తాయి. భూమిలోంచి వస్తున్న ఈ కాలకూట విషాన్ని వినియోగిస్తే చర్మవ్యాధులు వస్తాయని భయపడి అక్కడి జనం జలమండలి తాగునీటిని భద్రంగా దాచుకుంటున్నారు. వంట పని, ఇంటి పనులకు మినరల్ వాటర్ వినియోగిస్తున్నారు. భవన నిర్మాణాలకు ట్యాంకర్ల నీటిని తెప్పించుకుంటున్నారు. కాలుష్యం గురించి తెలిసినా కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు.
బోర్ల ఖర్చు వృథా:వీరభద్రనగర్‌లో ఉండే సురేష్‌రాయ్ ఇల్లు కట్టుకునేందుకు ఇటీవల బోరు వేశారు. రంగునీళ్లు వస్తున్నా పునాదుల వరకే కదా అని రసాయనాలు కలిసిన నీళ్లనే వినియోగించారు. నాలుగైదు రోజుల నుంచి ఎర్రటినీళ్లతో పాటు దుర్వాసన రావడంతో వాడకం నిలిపేశారు. వెంకటేశ్వరనగర్‌లో ఒక్కో బోరుకు రూ.1.50 లక్షలు ఖర్చయిందని, నిరుపయోగంగా మారాయని ప్రజలు వాపోతున్నారు.