తహసీల్దార్ నాగరాజు అక్రమాల ఉదంతంలో... ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులనూ కటకటాల్లోకి పంపిన అధికారులు.. వారిరువురిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే వీరిలో అంజిరెడ్డి వ్యవహారం ఇప్పటికే బహిర్గతం కాగా.. ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని శ్రీనాథ్ నేపథ్యం గురించి... అనిశా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. లంచం ఇచ్చిన సొమ్ములో సింహభాగం సమకూర్చింది... ఇతడే అనే ప్రాథమిక సమాచారం మేరకు ఆ సొమ్ము ఎక్కడిదని తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
శ్రీనాథ్ ప్రస్థానం
ఇప్పటి వరకు సేకరించిన వివరాల మేరకు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన శ్రీనాథ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి.. అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉప్పల్ చిలకానగర్లో సత్యసాయి డెవలపర్స్ పేరుతో.... స్థిరాస్తి వ్యాపార సంస్థను ప్రారంభించాడు. కీసర ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం పెరగడం వల్ల ఆ ప్రాంతం కేంద్రంగా కార్యకలాపాల్ని విస్తృతం చేశాడు. వివాదాస్పద భూముల వ్యవహారంలో తలదూర్చి... రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో వాటిని చౌక ధరలకే సొంతం చేసుకొనే ప్రయత్నాల్ని ఆరంభించాడు. కీసరతోపాటు హయత్‌నగర్ సమీపంలోని పసుమాముల ప్రాంతాల్లో.. స్థిరాస్తి కార్యకలాపాలు సాగించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ స్థిరాస్తి వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించాడు. అందులో భాగంగానే లింగాల ఘనపురంలోనూ భూముల్ని కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో కోట్ల విలువైన భూముల్ని కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాడనే కోణంలో... అనిశా వర్గాలు ఆరా తీస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డుల్ని.. అత్యంత గోప్యంగా దాచి ఉంచుతాడని తెలుసుకున్న అనిశా అధికారులు... హైదరాబాద్‌తో పాటు హన్మకొండ రాంనగర్‌లోని శ్రీనాథ్ సంబంధీకుల సమాచారాన్ని రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.