husband killed his wife by pouring sanitizer: కష్టాల్లో తోడుగా, తన సంతోషాన్ని పంచుకుంటూ జీవితాంతం అండగా ఉండాల్సిన తన భర్తే తన పాలిట యముడయ్యాడు. పెళ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే కట్టుకున్న భార్యకు నిప్పంటించాడు. కుమార్తెలు ఎంత వద్దన్నా వినకుండా కర్కశంగా ప్రవర్తించాడు. తమ తల్లి మృతికి తండ్రే కారణమంటూ కూతుళ్లు ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది: మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తిరునగరి నరేంద్ర, అతని భార్య నవ్య శ్రీ వాళ్ల ఇద్దరు కూతుళ్లు మేఘన, చందనలతో కలిసి జీవిస్తున్నారు. ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్న వారి కుటుంబంలో గత నెల 18న చిన్న గొడవ జరిగింది. అది కాస్త చినికి చినికి గాలివానలా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేంద్ర.. తన భార్య నవ్య శ్రీ ఒంటిపై శానిటైజర్ పోశాడు. అనంతరం అగ్గి పుల్లతో నిప్పంటించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి ఆమె ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
అనంతరం ఆమె కుమార్తెలు చుట్టుపక్కల వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందించారు. గత ఇరవై రోజులుగా ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు ఇవాళ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో నవ్య శ్రీ కుమార్తెలు చందన, మేఘనలు తమ తల్లి మరణానికి తండ్రే కారణమని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.