నేను కష్టపడి సంపాదించింది పావలా అయినా వదులుకోను... నాది కానిది ఎంతైనా నాకొద్దు అనుకునే వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కోవలోకే చెందుతాడు మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గంటి నరేశ్ గౌడ్. రోడ్డుపై దొరికిన బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పి... వారి ద్వారా బాధితులకు అందిజేసిన నరేశ్ గౌడ్‌ను కీసర సీఐ నరేందర్ గౌడ్ అభినందించారు.
ఈ ఆటో డ్రైవర్ ఎందరికో ఆదర్శం... ఎందుకంటే.. - hyderabad latest news
రోడ్డుపై రూపాయి నాణెం కనబడగానే... చుట్టుపక్కల చూసి చటుక్కున జేబులో వేసుకునే వాళ్లే ఎక్కువ మంది ఉన్న నేటి సమాజంలో... రోడ్డుపై దొరికిన బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పి... బాధితులకు అందజేశాడో ఆటో డ్రైవర్. అతని నిజాయితీకి మెచ్చి పోలీసులు వెయ్యి రూపాయల రివార్డు అందించారు. ఈ ఘటన కీసర ఠాణా పరిధిలో జరిగింది.
అసలేమైందంటే...
కిరాణా సామాను కోసం కీసర చౌరస్తాకు వచ్చిన రాధిక... తన ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో హ్యండ్ బ్యాగ్ తెగిపడిపోయింది. అదే మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్ నరేశ్‌గౌడ్ రోడ్డుపై ఉన్న బ్యాగును గుర్తించి... కీసర ఠాణాలో అందజేశాడు. బ్యాగును తెరిచి చూడగా.. 18,000 నగదు, బంగారు కమ్మలు, స్మార్ట్‌ఫోన్ ఉన్నాయి. బాధితులను గుర్తించిన పోలీసులు వారిని పిలిచి బ్యాగును అందజేశారు. పోయిందనుకున్న నగదు, వస్తువులు తెచ్చి ఇచ్చిన ఆటోడ్రైవర్‌కు బాధిత మహిళ ధన్యవాదాలు తెలిపింది. నిజాయితీగా వ్యవహరించిన నరేశ్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఐ సూచించారు.