Hakimpet Sports School Sexual Harassments Update : మేడ్చల్ జిల్లా హకీంపేట్‌లోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పాఠశాల ఓఎస్డీగా ఉన్న హరికృష్ణ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కథనాలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. చర్యలు తీసుకోవాలని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు.
ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు. కొత్త ఓఎస్డీగా సుధాకర్‌ను నియమించారు. కీసర ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రాగ జ్యోతి సహా పలు శాఖల అధికారులు దర్యాప్తులో పాల్గొన్నారు. హకీంపేట క్రీడా పాఠశాల కోచ్‌లు, వార్డెన్లు, బాలికలను పలుమార్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్‌కు వచ్చి HM లైంగిక వేధింపులు.. కర్రలు, చీపుర్లతో చితకబాదిన అమ్మాయిలు
ఓఎస్డీ హరికృష్ణపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. బాలికలతో విడివిడిగా స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. అధికారులకు నేరుగా చెప్పలేని విషయాలు ఉంటే పేపర్ మీద రాసి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఆరోపణలు చేసిన బాలికను రహస్య ప్రదేశంలో విచారించినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఆదేశం మేరకు మాజీ ఓఎస్డీని విచారించామని.. బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు జ్యోతి తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణకు సమయం పడుతుందన్నారు. అందుబాటులో ఉన్న అందరు ఉద్యోగుల నుంచి సమాచారం రాబట్టామన్నారు.
"ప్రాథమిక విచారణ అయిపోయింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విద్యార్థులను, టీచర్లను, మాజీ ఓఎస్డీని విచారించాం. ఇప్పుడే నివేదికను బయటపెట్టలేం. సున్నితమైన అంశం కాబట్టి.. పూర్తి విచారణకు సమయం పడుతుంది". - రాగ జ్యోతి, బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు