Fire Accident In Kukatpally: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదం అలజడి రేపింది. ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించిన సిబ్బంది.. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనాలు చేరుకొనేలోపే దట్టమైన పొగలు మొదటి అంతస్తును అంతా అలుముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల చిమ్మచీకటిలో ఆసుపత్రిలోకి వెళ్లడం కష్టతరంగా మారింది. రెండు గంటల పాటు అసలు ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్, పోలీసులు శ్రమించి రోగులను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఘటన స్థలానికి చేరుకుని దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ప్రమాదంలో కొందరు రోగులకు చిన్న గాయాలయ్యాయన్న అధికారులు విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.