హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ క్యాడర్, నాయకుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇంతటి దారుణమైన ఓటమి ఎప్పుడు చూడలేదన్న భావన పార్టీ నాయకుల్లో కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్‌ను, నాయకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు డిజిటల్ సభ్యత్వంపై (Congress Digital membership program) అవగాహన కార్యక్రమం పేరుతో టీపీసీసీ రెండు రోజులు మండల, పట్టణ, నియోజక వర్గ నాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది (congress political training). కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణా తరగతుల్లో ప్రధానంగా నాలుగు అంశాలపై పార్టీ క్యాడర్‌కు నేతలు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ కార్యాచరణ, పార్టీ భావజాలాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేందుకు వివిధ రంగాల నిపుణులతో దిశానిర్దేశం, పార్టీ క్రమశిక్షణ, పార్టీ గీత దాటిన వారిపై వేటు, హెచ్చరికలు, కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరాటాలపై ఈ రెండు రోజుల శిక్షణా తరగతుల్లో ఎక్కువ దృష్టి పెట్టారు.
ఆధారాలు ఇచ్చేందుకు నేను సిద్ధం.. మీరు చర్యలు తీసుకుంటారా..?
రాబోయే 18 నెలలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేలా శిక్షణా తరగతులలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి, రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే దానిపై హస్తం నేతలు అవగాహన కల్పించారు. తెరాస, భాజపా మధ్య నడుస్తున్న గొడవ...నిజమైంది కాదని...కేసీఆర్ అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలను ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, చర్యలు తీసుకోవడానికి భాజపా సిద్ధంగా ఉందా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రేవంత్ రెడ్డి...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగాలి