కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు కేసును అనిశా అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఇందుకోసం తహసీల్దార్ సహా మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకునేందుకు అనిశా అధికారులు పిటిషన్ వేశారు. ఇప్పటికే నాగరాజు అవినీతిపై అనిశా అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గతంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన నాగరాజు... ఈ సారి మరింత జాగ్రత్తపడినట్లు తెలిసింది. కారునే కార్యాలయంగా మార్చినట్లు సమాచారం. రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఆయన... వాటికి సంబంధించిన పత్రాలు, నగదును తన కారులోని రహస్య అరలో దాచేవాడు. చివరికి తన బ్యాంక్ ఖాతా పాసుపుస్తకం కూడా కారులోనే ఉంచాడు. లంచం తీసుకుంటూ పట్టుబడిన రోజు అధికారులు... కారును నాలుగైదుసార్లు తనిఖీలు చేయగా.. 8 లక్షల నగదు, బ్యాంక్ పాసుపుస్తకం, కీసర మండలంలో భూములకు సంబంధించిన దస్త్రాలు కనిపించాయి.
విడాకుల నాటకం
తహసీల్దార్ ఇంట్లో అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్న 28 లక్షల నగదు, బంగారు ఆభరణాల విషయం వెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. నగదు, బంగారాన్ని అనిశా అధికారులు తీసుకుని వెళ్లకుండా నాగరాజు దంపతులు విడాకుల నాటకాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులతో.... తహసీల్దార్ నాగరాజుతో తనకు సంబంధం లేదని ఆయన భార్య చెప్పినట్టు సమాచారం. విడాకులకోసం కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్న ఆమె..... ఇల్లు, నగదు, ఆభరణాలు తనకే చెందుతాయని వివరించింది. నాగరాజుకు ఫోన్ చేసి విడాకుల విషయం చెప్పగా..... ఆయన కూడా అవుననే చెప్పాడు. చివరికి తమదైన శైలిలో విచారించిన అధికారులు....తహసీల్దార్ నాగరాజు ఇంట్లో సోదాలు నిర్వహించి పంచనామాపై ఆయన భార్య సంతకం తీసుకున్నట్లు సమాచారం.