ఇవాళ శాసనసభ ఆవరణలో తెరాస ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, షకీల్‌లు మీడియాతో చిట్‌చాట్ జరిపారు. కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం ఉగ్రరూపం దాల్చి ... సాయంత్రం చల్లబడడం సరికాదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తాజ్‌మహల్‌కు రాళ్లెత్తినోళ్లు ఓనర్లు కారని ఎమ్మెల్సీ నారదాసు అనడం సరికాదని... అలా అనడం శ్రామిక వర్గాన్ని అవమానించడమే అని నారదాసుకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు.
' భాజపా ఎంపీ ఆర్వింద్‌ను కలిస్తే తప్పేంటి'
ఇటీవలె భాజపా ఎంపీ అర్వింద్‌ను కలిసి తెరాసలో కలకలం సృష్టించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడిగా పనిచేశానని... తమ ఇంటి పక్కనే ఉండే ఎంపీ అర్వింద్‌ను కలిస్తే తప్పేంటని షకీల్ ప్రశ్నించారు. తాను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తానని... ఎవరికి భయపడనంటూ స్పష్టం చేశారు. గోడ మీద పిల్లి లాగా ఉండనన్నారు. తన మీద ఒక్క కేసు ఉన్నట్టు నిరూపించిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గతంలో తనపై ఉన్న రెండు కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న ఓ ముస్లిం ఎమ్మెల్యేగా ఏ విధంగా భాజపాలో చేరుతానని వ్యాఖ్యానించారు. చివరగా తాను పార్టీ మారితే బాగుంటుందని తమ వాళ్లే అన్నారని... చెప్పడం కొసమెరుపు.
ఇవీ చూడండి:"ఇప్పుడు నా అక్కర మీకు లేదయ్యా.."