మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కాలంలో కరువు విలయతాండవం చేసింది. ఆ సమయంలో చేసేందుకు పని లేక పేద రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అప్పుడు వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్.
చార్లెస్ రాకతో..
ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ సువార్త సేవలు అందించాలనే ఉద్దేశంతో 1895లో ఇండియాకు వచ్చాడు. కొన్నాళ్లు మద్రాస్‌లో బోధనలు చేసి... అనంతరం సికింద్రాబాద్‌కు వచ్చారు. 1897లో మెదక్ టౌన్లో దాదాపు 150 ఏళ్ల కిందట బెర్లిన్ దొర నిర్మించిన చిన్న చాపేల్ చర్చి ప్రచారకుడిగా బదిలీ అయ్యాడు. అతను ఉండేందుకుగానూ... పాస్నెట్ అత్తామామలు మెదక్ మిషన్ కాంపౌండ్‌లో రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు.
బ్రాడ్ షా నమూనాతో..
చర్చి చిన్నగా ఉండి... తన భవనం పెద్ద ఉండడంతో పాస్నెట్ చర్చిని తన ఉండే భవనం కంటే ఎత్తులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడైన బ్రాడ్ షాతో చర్చించి 200 మోడల్స్ గీయించి... ప్రస్తుతం చర్చి ఉన్న నమూనాను ఎంపిక చేశాడు. కరువు కాలంలో 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణ పనులు... దాదాపు పదేళ్లు కొనసాగాయి. 173 అడుగులు ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో యూరప్ గోతిక్ శైలిలో అత్యంత సుందరంగా దీనిని నిర్మించారు. చెకోస్లోవేకియా దేశస్థులు దేవదారు కర్రతో తయారు చేసిన బైబిల్ పటాన్ వేదిక, రాంగ్గున్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనం బల్ల, రోజ్‌వుడ్‌తో తయారుచేసిన కుర్చీలు, టేబుల్, దర్వాజాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
అదే ప్రత్యేకత..
లండన్‌కు చెందిన కళాకారుడు సాలిస్... చర్చిలో ఎత్తైన విండోస్‌పై చిన్న చిన్న రంగురంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కలు ఫిక్స్ చేసి... ఏసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్లకు కట్టినట్టు రూపొందించటం విశేషం. బయట నుంచి సూర్యకాంతి పడినప్పుడు మాత్రమే ఈ విండోస్‌పై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడం వీటి ప్రత్యేకత.