కోటి 12 లక్షల లంచం కేసులో నిందితులుగా ఉన్న అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్టీఓ అరుణా రెడ్డితో పాటు మరో ముగ్గురికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఐదుగురు నిందితుల కస్టడీ ముగియడం వల్ల అవినీతి నిరోధక శాఖాధికారులు వాళ్లను వైద్య పరీక్షల కోసం కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా... ఐదుగురికి నెగిటివ్‌గానే ఫలితం వచ్చింది. అక్కడి నుంచి తీసుకెళ్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు.
ఐదుగురు నిందితులకు వచ్చే నెల 8 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో నగేశ్, అరుణా రెడ్డి, సత్తార్, వసీం, జీవన్ గౌడ్లను అనిశా అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. నగేశ్, సత్తార్, జీవన్ గౌడ్ తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అరుణా రెడ్డి తరఫు న్యాయవాది రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.