మెదక్ జిల్లాలో శరవేగంగా వ్యాపిస్తోన్న కరోనా కట్టడ్డికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. బాధితులను గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే విజయవంతంగా కొనసాగుతోందని వివరించారు. బాధితులకు మెడికల్ కిట్లు అందజేయడానికి, వైద్య సేవల పర్యవేక్షణకు ప్రతి డివిజన్‌కు ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. వీరి ద్వారా జిల్లా యంత్రాంగానికి, వైద్యారోగ్య శాఖాధికారికి నివేదిక అందుతుందని వివరించారు.
' జిల్లాలో కరోనా కట్టడికి సమగ్ర చర్యలు' - మెదక్ కొవిడ్ కేసులు
కరోనా రెండో దశ ఉద్ధృతి పట్ల జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ హరీశ్ కోరారు. మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
బాధితులను గుర్తించేందుకు నియమించిన ప్రత్యేక బృందాలు.. రోగుల వివరాలన్నింటిని ఓ పట్టికగా రూపొందించి మండల ప్రత్యేకాధికారి, డివిజనల్ నోడల్ అధికారి సంతకాలతో ఉన్నతాధికారులకు పంపుతారని కలెక్టర్ తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి బాధితులకు మెడికల్ కిట్లు అందించడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. లక్షణాలు కలిగి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోన్నవారిని ఆసుపత్రులకు తరలించడానికి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.