మెతుకుసీమ పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఏటా వానాకాలంలో వరి, మొక్కజొన్న, పత్తి... రబీ సీజన్‌లో వరి పంట సాగుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రభుత్వం వచ్చే వానాకాలం నుంచి నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేపట్టాలని సూచించడం వల్ల జిల్లాలో వరి, పత్తి, కందితోపాటు పెసర పంటల సాగుకు ఆమోదం తెలిపింది.
గతేడాది వానాకాలంలో 2.40 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలను సాగు చేయగా, ఈసారి అదనంగా 20,560 ఎకరాల్లో పంటలు వేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు వచ్చే వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.60 లక్షల ఎకరాల్లో ఆయా పంటలను సాగు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు.
మక్కలు వద్దు...
వచ్చే వానాకాలంలో మొక్కజొన్న పంట పండించవద్దని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. దీంతో వచ్చే సీజన్‌లో మక్కల పంట వేయకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది వానాకాలంలో 33,469 ఎకరాల్లో మక్కల పంట వేయగా, ఈసారి ఒక ఎకరంలోనూ పంట సాగు చేయడానికి వీలు లేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మక్కకు బదులు కంది సాగు పెంచాలని సూచిస్తున్నారు.
గతేడాది మూడు వేల ఎకరాల్లో కంది పంట వేయగా, ఈ సారి 25వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సాధారణంగా జిల్లాలో వరి పంట వేసేందుకు రైతులు అధికశాతం మొగ్గు చూపుతారు. ఈసారి 1.35 లక్షల ఎకరాల్లో వరి వేయాలని అధికారులు సూచించారు. పత్తి సైతం గతేడాది కంటే ఈసారి అదనంగా 9 వేల ఎకరాల్లో ఎక్కువ సాగు చేయనున్నారు. 2,670 ఎకరాల్లో పెసర, 2,200 ఎకరాల్లో జొన్నలు, 1,541 ఎకరాల్లో మినుములు, 500 ఎకరాల్లో చెరకు పంటలను ఎక్కువుగా పండించనున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.