KCR Speech in BRS Meeting at Medak : మెదక్ ప్రగతి శంఖారావం సభ వేదికగా.. అభివృద్ధిని ప్రస్తావిస్తూనే విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR Medak Tour) చురకలు అంటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలిసారిగా అధికార బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం.. ప్రగతి శంఖారావాన్ని పూరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు తెచ్చుకుని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని తెలిపారు. పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రగతి, సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించామని కేసీఆర్ వివరించారు.
KCR Fires on Congress and BJP :కేంద్రం సహకరించకపోయినా.. కరోనా, నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డా.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ మోటర్లకు మీటర్లు పెట్టాలంటుంటే.. కాంగ్రెస్ నాయకులు సాగు రంగానికి మూడు గంటల కరెంట్ చాలని ప్రజలను ఏమార్చుతున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలను దూరంగా పెట్టాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తే.. మళ్లీ పైరవీకారుల చేతుల్లోకి భూములు పోతాయని కేసీఆర్ ఆక్షేపించారు. మెదక్ సభలో విపక్షాలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. నమ్మకం బీఆర్ఎస్ పెట్టుబడి అయితే.. అమ్మకం ప్రతిపక్షాల నైజం అని ఆయన ఘాటుగా విమర్శించారు.
"తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని మెరుగుపరిచాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు తెచ్చుకున్నాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు సరఫరా చేస్తున్నాం. బీజేపీ మోటర్లకు మీటర్లు పెట్టాలంటుంది. మాకు ఒక్క ఛాన్స్ అని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటుంది. ధరణి తీసేయాలన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేయాలి. రైతు బీమా సదుపాయం అమెరికాలో కూడా లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది." - కేసీఆర్, ముఖ్యమంత్రి
అంతకుముందు మెదక్‌లో కేసీఆర్ తొలుత బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్‌తో పాటు ఎస్పీ కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. వికలాంగుల ఆసరా పింఛను రూ.4016 పెంపు కార్యక్రమాన్ని మెదక్‌లో సీఎం ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మెదక్‌లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించుకున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాకముందు.. పరిపాలన చేతకాదని విమర్శించారని ఆయన గుర్తు చేశారు.