వలస కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రి పర్యటించారు. హైదరాబాద్ నుంచి 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలతో మాట్లాడి... ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నందున... పూర్తి వసతి కల్పిస్తుందని తెలిపారు.
మనోహరాబాద్ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 88 మంది వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500ల నగదు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 4లక్షల మంది వలస కూలీలకు నిత్యావసర సరకులు అందించగా... మరో 2 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల బాధ్యత ఆయా కన్స్ట్రక్షన్ కంపెనీల యజమానులదేనన్నారు. ఒకవేళ వారికి సాధ్యం కాకపోతే అధికారుల దృష్టికి తీసుకువస్తే... ప్రభుత్వమే వారికి సరకులు అందజేస్తుందన్నారు.