Farmers Protest: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతిధర్మారం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత రెండు రోజులుగా విద్యుత్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఇస్తున్నారని.. అలా కాకుండా 24 గంటల విద్యుత్ ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. వేసవిలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని గతంలో సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని ఇప్పుడు కేవలం 10 గంటల ఇవ్వడం ఎంతవరకు న్యాయమని అన్నదాతలు ప్రశ్నించారు.
అసలే వేసవి కాలం.. మధ్యాహ్నం పూట కరెంటు ఇవ్వడం వల్ల బోరు మోటార్లలో నీరు రావడం లేదని.. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని 24 గంటల కరెంటు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రామాయంపేట ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేసి నిరసనను విరమింప చేశారు.