గృహాలు ఉన్నట్లు చూపించిన స్థలం
అక్కడ ఒక్క ఇంటి నిర్మాణం లేదు.. కనీసం మొదలుపెట్టిన ఆనవాళ్లూ లేవు. ఎటు చూసినా ఖాళీ స్థలమే కనిపిస్తుంది. మున్సిపల్ అధికారుల దృష్టిలో మాత్రం అక్కడ 44 ఇళ్ల వరకు ఉన్నట్లు కనిపిస్తాయి. అదేంటి మనకు కనిపించకుండా.. వాళ్లకు ఎలా కనిపిస్తుందనా.. మీ అనుమానం. అవును ఇది నిజమే.. అక్కడ ఏం కనిపించకున్నా 44 మాయా గృహాలు ఉన్నట్లు నమ్మి తీరాల్సిందే. మహాభారతంలో మయసభ లాంటివన్న మాట. స్థిరాస్తి వ్యాపారులు మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సర్వే నం.20, 21లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ఇంటి నంబర్లు పొందడం విస్మయం కలిగిస్తోంది.
గూగుల్ మ్యాప్‌లో చూపిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు భూమి
మున్సిపల్ చట్టం ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాణ స్వభావాన్ని అనుసరించి, విస్తీర్ణం ఆధారంగా పన్ను నిర్ణయిస్తూ, నెంబరు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు భౌతికంగా సర్వే నిర్వహించి, నిర్ధారణ చేయాలి. ఇక్కడ మాత్రం ఖాళీ స్థలాన్ని గృహాలున్నట్లుగా నమ్మించి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ మాయా గృహాలను రిజిష్టరు చేయడం విశేషం. రిజిస్ట్రేషన్ చేసేముందు అక్కడ ఇల్లు ఉందా, లేదా.. అని నిర్ధారించుకున్న తర్వాతే రిజిష్టరు చేయాల్సిన అధికారులు.. కేవలం కాగితాలను చూసి పని చేస్తున్నారు. అదీ ఒక్కరి పేరిటే 40కిపైగా గృహాలున్నా పట్టించుకోకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. మున్సిపల్, రెవెన్యూ, తనిఖీ అధికారి నుంచి మొదలుకుంటే పైస్థాయి వరకు ఎంతో మంది అధికారులు ఏమవుతుందిలే అన్న నిర్లిప్తతతో మాయా గృహాలకు అనుమతినివ్వడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ భూమి నుంచి వెంచర్‌లోకి వేసిన రహదారి
పాలనాధికారి కార్యాలయ నిర్మాణాలకు వంద గజాల దూరంలోనే..